Odisha: ఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డిసెంబర్ 29న తెల్లవారుజామున కోరాపుట్ జిల్లా సమీపంలోని దాపరిఘాటి కొండ ప్రాంతంలో కటక్‌లోని నియాలీ నుంచి గుప్తేశ్వర్ ఆలయానికి భక్తులతో వెళ్తున్న బస్సు పల్టీ కొట్టింది. బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నారు.
పెద్ద మలుపు వద్ద బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 40 మందికి గాయాలు అయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను బోయిపరిగూడ వైద్యశాలకు తరలించారు.
ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ మాఝీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.