Fire Accident: మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో జాతీయ రహదారి 44 (NH-44) పై గురువారం ఒక భయంకరమైన అగ్నిప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఒక పెద్ద కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ నష్టం వాటిల్లింది. లారీ నుంచి దట్టమైన పొగలు, పెద్ద ఎత్తున మంటలు రావడంతో హైవేపై వెళ్తున్న వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఈ ప్రమాదం కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మార్గంలో జరిగింది. సరికొత్త కార్ల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ లారీ తూప్రాన్ పరిధిలోకి రాగానే.. మొదట లారీ కేబిన్ భాగంలో మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే ఆ మంటలు క్షణాల వ్యవధిలో కంటైనర్ మొత్తం విస్తరించాయి. ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. కంటైనర్ లోపల ఉన్న ఎనిమిది సరికొత్త కార్లు మంటల్లో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దీనివల్ల కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
హైవేపై కంటైనర్ తగలబడుతున్న విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే స్పందించారు. ఎలాంటి ముప్పు జరగకుండా ఉండేందుకు హైదరాబాద్ వెళ్లే దారిలో వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. దీంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది కూడా ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
లారీలో జరిగిన షార్ట్ సర్క్యూట్ లేదా ఏదైనా సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినప్పటికీ.. లారీ డ్రైవర్, క్లీనర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి వెంటనే కిందికి దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.
