Kavita: ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ ఏడాది గడిచినా వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. డిగ్రీ చదివిన యువతులకు స్కూటీలు అందిస్తామన్న హామీ గురించి ఆమె ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం చేయాలని చెప్పి, ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయలేదని అన్నారు.కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం అందించలేకపోయారని ఆరోపించారు.
మైనారిటీలకు ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని విమర్శించారు.పెన్షన్ల పెంపు కూడా చేయలేకపోయిందని అన్నారు.బీరాలు పలికిన కాంగ్రెస్ సర్కారు ప్రజల సమస్యలపై స్పందించడంలో విఫలమైందని మండిపడ్డారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ నేతలను నిలదీయాలని ప్రజలను కోరారు. ద్యార్థులు, రైతులు, మహిళలు, ఉద్యోగులు ఇలా ప్రతి వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.
“మనం ప్రశ్నిస్తేనే ప్రభుత్వం కదులుతుంది,” అని ఆమె అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన మంచి పథకాలను కొనసాగించాలని, రాష్ట్రంలో పోలీసులు అధికారం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ స్థానంలో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.