Cockroach Janata Party: సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న పొలిటికల్ శాటైరికల్ (వ్యంగ్య) అకౌంట్ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP)కి పెద్ద షాక్ తగిలింది. భారతీయ రాజకీయాలపై తనదైన శైలిలో జోకులు, వ్యంగ్య పోస్టులు పెడుతూ నెటిజన్లను ఆకట్టుకున్న ఈ అకౌంట్‌ను ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ‘ఎక్స్’ భారతదేశంలో నిలిపివేసింది. కేవలం కొద్ది రోజుల్లోనే విపరీతమైన పాపులారిటీ సంపాదించిన ఈ అకౌంట్, ఏకంగా అధికార భారతీయ జనతా పార్టీ (BJP) ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను కూడా దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో అధికార బీజేపీకి 8.8 మిలియన్ల ఫాలోవర్లు ఉంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఏకంగా 13.2 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం విశేషం. ఇలాంటి క్రేజీ సమయంలో, మంచి ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్న తరుణంలోనే ఈ అకౌంట్‌పై నిషేధం పడటం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
ఈ హఠాత్ పరిణామంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందించారు. తన ఎక్స్ ఖాతాను ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తున్న స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. “మనం ముందే ఊహించినట్లుగానే ఇండియాలో కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్‌ను నిలిపివేశారు” అని పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఎక్స్‌లో @CJP_2029 అనే యూజర్‌నేమ్‌తో ఉన్న ఈ అకౌంట్‌ను ఓపెన్ చేస్తే.. ‘అకౌంట్ విత్‌హెల్డ్’ అని చూపిస్తోంది. ఒక లీగల్ డిమాండ్ కు స్పందనగానే భారతదేశంలో ఈ అకౌంట్‌ను ఆపేసినట్లు అక్కడ స్పష్టంగా రాసి ఉంది.
అసలు ఈ అకౌంట్‌ను ఎందుకు నిలిపివేశారనే విషయానికి వస్తే.. ఎక్స్ సంస్థ రూల్స్ ప్రకారం ఏదైనా అధికారిక సంస్థ లేదా ప్రభుత్వం నుంచి చట్టపరమైన అభ్యర్థన వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకుంటారు. స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు తేలినా లేదా కోర్టులు, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినా.. ఆయా దేశాల పరిధి వరకు మాత్రమే ఆ అకౌంట్ కనిపించకుండా యాక్సెస్‌ను నిలిపివేస్తామని ఎక్స్ సంస్థ స్పష్టం చేసింది. ప్రభుత్వ లీగల్ డిమాండ్ల వల్లే ఈ ఫేమస్ పొలిటికల్ అకౌంట్‌ను ఇండియాలో బంద్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.
