Brutal Murder: హైదరాబాద్ నగర శివారు దమ్మాయిగూడ (కాప్రా మున్సిపాలిటీ పరిధి) సాకేత్ కాలనీలో రియల్టర్‌పై దుండగులు అత్యంత పాశవికంగా దాడి చేసి హతమార్చారు. కూతురిని స్కూల్‌కు దింపడానికి వెళ్తున్న 55 ఏళ్ల రత్నాకర్ అనే వ్యక్తిని పక్కా ప్లాన్‌తో వెంబడించిన దుండగులు నడి రోడ్డుపై నరికి, తుపాకీతో కాల్చి చంపడం స్థానికంగా భయాందోళనలు సృష్టించింది.
ఉదయం 9 గంటల ప్రాంతంలో ఘటన
జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీ ఫోస్టర్ స్కూల్ సమీపంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. రియల్టర్‌గా గుర్తింపు పొందిన రత్నాకర్ (55) తన మూడో కూతురిని స్కూలుకి దింపడానికి తన TS 08EP3075 నంబర్ గల యాక్టివా స్కూటీపై వెళ్తున్నారు.

సరిగ్గా ఆ సమయంలోనే ఆటో, రెండు బైకులపై వచ్చిన దుండగుల బృందం వెనుక నుంచి ఆయన వాహనాన్ని ఢీ కొట్టి కిందపడేశారు. క్షణం ఆలస్యం చేయకుండా, రత్నాకర్‌పై అత్యంత కిరాతకంగా వేట కత్తులతో దాడి చేశారు. కత్తులతో విచక్షణారహితంగా నరికిన అనంతరం, దుండగులు తుపాకీతో కాల్చి చంపినట్టు తెలుస్తోంది. మృతుడి తల వెనుక భాగంలో తీవ్ర గాయాలున్నాయి.
ఇది కూడా చదవండి: Telangana Global Summit: 3 ట్రిలియన్ డాలర్లు లక్ష్యం.. నేటి నుంచే ‘రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’!
తుపాకీ కాల్పులు, హల్చల్!
సంఘటనా స్థలంలో పోలీసులు ఒక వేట కత్తి, బుల్లెట్ దొరికినట్టు నిర్ధారించారు. నరికిన తర్వాత తుపాకీతో కాల్చడంతోనే రత్నాకర్ మరణించినట్టు భావిస్తున్నారు.హత్య అనంతరం దుండగులు గాలిలో తుపాకీ చూపిస్తూ హల్చల్ సృష్టించి పారిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
నడి రోడ్డుపై, అదీ ఉదయం పూట పాఠశాల సమీపంలో ఈ తరహా హత్య జరగడం నగరంలో సంచలనం రేపింది. మృతుడు రత్నాకర్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తెను స్కూల్‌కు తీసుకువెళుతున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల దర్యాప్తు ప్రారంభం
ఘటన గురించి తెలుసుకున్న వెంటనే జవహర్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తుంది. ఈ పక్కా ప్లాన్డ్ హత్య వెనుక రియల్ ఎస్టేట్ వివాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారైన దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

