KTR: తెలంగాణ రాజకీయాల్లో తాజాగా బీఆర్‌ఎస్ పార్టీలో చోటుచేసుకుంటున్న అభిప్రాయ భేదాలపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మరింత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసిన ఆయన, సూచనలు ఇవ్వాలనుకునే వారెవరికైనా లేఖలు రాయడానికి హక్కు ఉందని తెలిపారు. అయితే పార్టీలో ఉండే వారు అంతర్గతంగా మాట్లాడటం శ్రేయస్కరం అనే సందేశాన్ని కూడా స్పష్టం చేశారు.
తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇటీవల పార్టీ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖపై పరోక్షంగా స్పందించారు. “మా పార్టీలో ప్రజాస్వామిక స్పూర్తి ఉంది. ఎవరైనా తమ అభిప్రాయాలు, సూచనలు లేఖల రూపంలో తెలియజేయవచ్చు. అయితే, వాటిని పార్టీలో అంతర్గతంగా చర్చించడం మంచిది. లేఖలు రాయడమే కాదు, ఆ విషయం గురించి పార్టీ లోపలే మాట్లాడితే ఆ పరిష్కారం త్వరగా కదులుతుంది” అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Donald Trump: భారతదేశంలో ఐఫోన్లు తయారు చేస్తే.. 25% సుంకంవిధిస్తాం..యాపిల్‌కు ట్రంప్ టారిఫ్ వార్నింగ్..
అంతేకాదు, “ప్రతి పార్టీలో కోవర్టులు ఉంటారు. ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నపుడు దేవుడు, దెయ్యం లాంటి పదాలు ఎందుకు కావాలి?” అంటూ బహుశా ఆంతర్గత విషయాల్ని బహిరంగంగా చర్చించడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తపరిచారు.
పార్టీ శ్రేయస్సు కోసం అంతర్గత వ్యవహారాలు పార్టీలోనే చర్చించాలి
కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ పార్టీలో ఇటీవలి పరిణామాలకు సంబంధించి కీలక సంకేతాలను ఇస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత లేఖ వ్యవహారం పార్టీలో పెరుగుతున్న అభిప్రాయ భిన్నతను వెల్లడిస్తుండగా, కేటీఆర్ వ్యాఖ్యలు పార్టీ లోగడలపై కట్టుదిట్టమైన పద్ధతిని పాటించాలన్న సూచనలుగా కనిపిస్తున్నాయి.

