F-35 Fighter Jet: తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో నెల రోజులకుపైగా నిలిచిపోయిన బ్రిటన్‌కు చెందిన ఎఫ్-35బి (F-35B) స్టెల్త్ యుద్ధ విమానం ఈరోజు ఉదయం ఎట్టకేలకు గాల్లోకి ఎగిరింది. జూన్ 14న అత్యవసర పరిస్థితుల్లో కేరళలో ల్యాండింగ్ చేసిన ఈ యుద్ధ విమానం, సాంకేతిక లోపం కారణంగా ఇక్కడే నిలిచిపోయింది.
సాంకేతిక లోపం – నిపుణుల సహాయం
హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య తలెత్తడంతో విమానం మళ్లీ ఎగరలేకపోయింది. దీంతో బ్రిటన్ రాయల్ నేవీ నుంచి ప్రత్యేక నిపుణుల బృందం జూలై 6న కేరళకు వచ్చింది. మొత్తం 24 మంది సాంకేతిక నిపుణులు విమానానికి మరమ్మతులు చేశారు. ప్రత్యేక పరికరాలను కూడా యూకే నుంచి రప్పించారు. అన్ని భద్రతా తనిఖీలు పూర్తిచేసిన తర్వాతే విమానానికి ఎగరడానికి అనుమతి ఇచ్చారు.
కేరళలో 40 రోజుల బస
సుమారు 40 రోజులపాటు ఈ యుద్ధ విమానం కేరళలో ఉండటంతో స్థానికుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఎఫ్-35బి రోజువారీ పార్కింగ్ ఛార్జీలు మాత్రమే రూ.26,000 కాగా, మొత్తం 35 రోజుల బసకు రూ.9 లక్షలకు పైగా చెల్లించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా కేరళ టూరిజం కూడా “కేరళ – మీరు ఎప్పటికీ వదిలి వెళ్లకూడదనుకునే గమ్యస్థానం” అంటూ సోషల్ మీడియాలో సరదా మీమ్ షేర్ చేసింది.
ఇది కూడా చదవండి: Maharastra: సినీఫక్కీలో మైనర్‌కు కత్తితో యువకుడి బెదిరింపు.. చాకచక్యంగా తప్పించి స్థానికుల దేహశుద్ధి
యుద్ధ విమానం ప్రత్యేకతలు
ఎఫ్-35బి ప్రపంచంలో అత్యంత ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటి. లాక్‌హీడ్ మార్టిన్ రూపొందించిన ఈ ఫైటర్ జెట్‌కు షార్ట్ టేకాఫ్, నిలువు ల్యాండింగ్ సదుపాయాలు ఉన్నాయి. యూకే రాయల్ నేవీకి చెందిన ఈ విమానం HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పనిచేస్తోంది. ఇటీవల భారత నావికాదళంతో ఉమ్మడి సముద్ర విన్యాసాల్లో కూడా పాల్గొంది.
ఎట్టకేలకు గాల్లోకి ఎగిరిన ఫైటర్ జెట్
అనేక వారాల సాంకేతిక తనిఖీల తర్వాత ఈ ఉదయం తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్ నుంచి ఎఫ్-35బి విజయవంతంగా టేకాఫ్ అయింది. యూకే అధికారులు భారత వైమానిక దళం, విమానాశ్రయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.