Chahal: ప్రముఖ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకుల పిటిషన్‌పై రేపటి రోజే నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. చాహల్ ఐపీఎల్‌లో పాల్గొనాల్సి ఉన్నందున మార్చి 21 నుండి అందుబాటులో ఉండరని జస్టిస్ మాధవ్ జాందార్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ తెలిపింది. బార్ అండ్ బెంచ్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ కేసులో బాంబే హైకోర్టు 6 నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను కూడా మాఫీ చేసింది. ఈ ఉత్తర్వులు ఇస్తున్న సందర్భంగా హైకోర్టు వారిద్దరూ గత రెండున్నర సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నారని, రూ.4.75 కోట్ల పరిష్కారం కోసం చర్చలు కూడా జరిగాయని తెలిపింది.
గత రెండున్నర సంవత్సరాలుగా వారిద్దరూ విడివిడిగా నివసిస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. చాహల్, అతని భార్య ధనశ్రీ విడాకులు తీసుకున్నారనే వదంతులు చాలా కాలంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే, చాహల్ మరియు ధనశ్రీ నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
చాహల్ వేసిన పిటిషన్ ఇదీ..
సెటిల్‌మెంట్ మొత్తంలో సగం ధనశ్రీకి ఇచ్చానని యుజ్వేంద్ర చాహల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి, అతనికి 6 నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ అవసరం లేదనేది ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిని ఇప్పుడు హైకోర్టు ఆమోదించింది. కూలింగ్ పీరియడ్ అంటే విడాకుల పిటిషన్ తర్వాత, భార్యాభర్తలు 6 నెలల పాటు కొంతకాలం కలిసి జీవించాలని ఆదేశిస్తారు. దీనిలో రెండు పార్టీలు విడాకుల గురించి మరోసారి ఆలోచించడానికి సమయం ఇస్తారు.
ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయిన ఝలక్ దిఖ్లా జా-11 ఎపిసోడ్ సందర్భంగా ధనశ్రీ వర్మ యుజ్వేంద్ర చాహల్‌తో తన ప్రేమకథ గురించి వెల్లడించింది . లాక్డౌన్ సమయంలో డ్యాన్స్ నేర్చుకోవడానికి చాహల్ తనను ఎలా సంప్రదించాడో ఆమె చెప్పింది. దీని తరువాత ధనశ్రీ అతనికి నృత్యం నేర్పించడానికి అంగీకరించింది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తరువాత పెళ్లి చేసుకున్నారు.
Also Read: IPL 2025: కిక్కిచ్చే ధనాధన్ క్రికెట్..ఐపీఎల్ 18కి సర్వం సిద్ధం!
రెండేళ్ల క్రితమే..
అయితే, రెండేళ్ల క్రితం అంటే 2023 సంవత్సరంలో, యుజ్వేంద్ర చాహల్ తన సోషల్ మీడియాలో ఒక కథనాన్ని పంచుకున్నారు. అందులో “కొత్త జీవితం రాబోతోందని” రాశారు. దీని తర్వాత, నటి ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పేరు నుండి చాహల్ అనే ఇంటిపేరును తొలగించింది. దీని తరువాత, వారి విడాకుల వదంతులు తీవ్రమయ్యాయి. అయితే, ఆ క్రికెటర్ తరువాత విడాకులపై వస్తున్న వార్తలన్నీ వదంతులంటూ కొట్టి పడేశాడు.
టీమిండియాకు దూరంగా చాహల్..
యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం టీం ఇండియాకు దూరంగా ఉన్నాడు. అతను 2024 T20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగం కానీ, ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అతను భారతదేశం తరపున తన చివరి ODIని జనవరి 2023లో ఆడాడు. అతని చివరి T20 ఆగస్టు 2023లో జరిగింది. దీని తర్వాత కూడా, IPL 2025 వేలంలో, పంజాబ్ కింగ్స్ అతన్ని రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది.