Bomb Threat: లండన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ బెదిరింపు సమాచారం తెలుసుకున్న పైలట్ వెంటనే అప్రమత్తమై, విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు.
విమానం దిగిన వెంటనే ప్రయాణికులందరినీ బయటకు దించి, బాంబ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. వారు విమానమంతటా చాలా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. సుదీర్ఘ తనిఖీల తర్వాత, విమానంలో ఎలాంటి బాంబు లేదని భద్రతా అధికారులు ధృవీకరించారు. దీంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ బెదిరింపు మెయిల్ గురించి ఎయిర్‌పోర్ట్ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎయిర్‌పోర్ట్ పోలీసులు, బాంబు బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

