Hanuman: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరుగుతున్న కొద్దీ, సినిమా పరిశ్రమలోనూ దాని ప్రభావం గట్టిగా కనిపిస్తోంది. కథల రచన నుంచి విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ వరకు ఏఐ ఉపయోగం సినిమా మేకింగ్ లో కొత్తదనాన్ని తెస్తోంది. ఇప్పటివరకు చిన్నస్థాయి షార్ట్‌ఫిల్మ్స్, యానిమేటెడ్ వీడియోలలో మాత్రమే ఏఐని ఉపయోగించగా, ఇప్పుడు బాలీవుడ్‌లోనే ఒక భారీ ఏఐ ప్రాజెక్ట్ రూపొందబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
‘చిరంజీవి హనుమాన్’ పేరుతో వస్తున్న ఈ చిత్రం, పురాణాల్లో అత్యంత శక్తివంతుడైన హనుమంతుని శౌర్యం, భక్తి, సాహసగాథను ప్రత్యేక యానిమేషన్ శైలిలో చూపించబోతోంది. ఇది సాధారణ మిథాలజీ సినిమా కాకుండా, ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ రూపొందిస్తున్న ప్రాజెక్ట్‌గా చెప్పుకోవచ్చు. హనుమంతుని ధైర్యం, అచంచల భక్తి, సాహసాలను ఇప్పటివరకు స్క్రీన్‌పై చూడని విధంగా చూపించాలన్నది మేకర్స్ ప్రధాన లక్ష్యం.
ఇది కూడా చదవండి: Delhi: ఇండియా కూటమి అభ్యర్థి తెలంగాణ వాసి
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు విక్రమ్ మల్హోత్రా, విజయ్ సుబ్రహ్మణ్యం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హనుమంతుని గాథను గ్లోబల్ స్థాయిలో చూపించేందుకు ఇంటర్నేషనల్ టెక్నీషియన్లతో కలిసి ఏఐ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తున్నారని టీమ్ వెల్లడించింది. అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాల రూపకల్పనలో కూడా ఏఐ కీలక పాత్ర పోషించబోతోంది.
ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించింది. హనుమంతుడి శక్తివంతమైన రూపం, కొత్త శైలిలోని డిజైన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఈ చిత్రం వచ్చే ఏడాది హనుమాన్ జయంతి సందర్భంగా థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. భారతీయ మిథాలజీని, ఆధునిక సాంకేతికతను కలిపిన ఈ వినూత్న ప్రయత్నం ఎంత విజయవంతం అవుతుందో చూడాలి.