BJP: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన భయానక ఉగ్రదాడిపై స్పందించిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, ఈ దారుణానికి పాల్పడిన నిందితులను తక్షణమే భారత్‌కు అప్పగించాలంటూ పాకిస్థాన్‌ను డిమాండ్ చేశారు. ఈ విషయంలో పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర ఒత్తిడి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, పహల్గామ్‌లో జరిగిన అమానుష ఘటనలో 26 మంది హిందూ పర్యాటకులను వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే పాశవికంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడికి బాధ్యత వహించేవారిని కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అధికారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ‘నరహంతకులు’గా అభివర్ణించిన స్వామి, వారిని భారత చట్టాల కింద తీసుకువచ్చి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు న్యాయం జరగాలంటే, ఈ దోషులను భారత్‌కు అప్పగించక తప్పదని స్పష్టం చేశారు.