Hyderabad: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
బీజేపీ ఎలక్షన్ కమిషన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి శంకర్ తదితరులు ఎన్నికల సంఘాన్ని కలిసి,
“ప్రభుత్వం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తోంది. ప్రత్యేక వర్గాన్ని ఆకట్టుకోవడానికి మంత్రివర్గ విస్తరణ చేపడుతోంది” అని ఆరోపించారు.
అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఉప ఎన్నికల సమయంలో ఆయనను మంత్రిగా చేయడం తగదని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణపై తక్షణమే ఆపిచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 31న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశమున్నట్లు సమాచారం. అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు కూడా ఉండొచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేతలు ఎన్నికల సంఘం వద్ద ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

