Pawan Kalyan: బీజేపీ-అన్నాడీఎంకే పొత్తుతో తమిళనాడు రాజకీయాలు హీటెక్కాయి! అమిత్ షా స్వయంగా పళనిస్వామి ఇంట్లో టీ తాగి, సీఎం పోస్టుని ఆఫర్ చేశారు. పళని కండీషన్‌కి కూడా ఓకే చెప్పేస్తూ… అన్నామలైని సైడ్ చేసి, నయినార్ నాగేంద్రన్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసిన ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు టీవీకే అధిపతి దళపతి విజయ్ సోలోగానే బరిలో దిగుతారా? డీఎంకేకు ఈ కూటమి చెక్ పెడుతుందా? లేక విజయ్ హవా గేమ్ ఛేంజర్ అవుతుందా? మరోవైపు సౌత్‌ఇండియా పొలిటికల్ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సపోర్ట్‌తో ఎన్డీఏ జోరు తమిళనాట మరింతగా పెరగనుందా? టేక్ ఎ లుక్.
తమిళనాడు రాజకీయ వేదికపై కొత్త సమీకరణలు ఆవిష్కృతమవుతున్నాయి. తాజాగా బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు ఖరారు కావడం రాష్ట్రంలో రాజకీయ హీట్‌ను పెంచేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అన్నాడీఎంకే అధినేత పళనిస్వామితో చర్చలు జరిపి కూటమిని ప్రకటించేశారు. మరో ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుండే ఈ వ్యూహాత్మక కూటమి రూపొందడం.. డీఎంకేకు సవాల్‌గా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అన్నామలై రాజీనామా చేయడం, పళనిస్వామి సారథ్యాన్ని బీజేపీ ఖరారు చేయడం ఈ పొత్తు ఒప్పందంలో కీలక అంశాలు. అమిత్ షా స్వయంగా చెన్నైలోని పళనిస్వామి ఇంటికి వెళ్లి చర్చలు జరపడం, సీఎం పదవి అన్నాడీఎంకేదే అని హామీ ఇవ్వడం… ఆదిలోనే ఈ కూటమి బలాన్ని సూచిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: China: చైనా మరో ఇంజినీరింగ్ అద్భుతంతో ప్రపంచ రికార్డు
గతంలో బీజేపీ-అన్నాడీఎంకే కలిసి 30 లోక్‌సభ సీట్లు గెలిచిన చరిత్ర ఉంది. ఈసారి కూడా ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధిస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే అన్నామలై స్థానంలో తిరునల్వేలి ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం దక్షిణ తమిళనాడులో దేవర్ సామాజిక వర్గాన్ని ఆకర్షించే వ్యూహంగా కనిపిస్తోంది. ఈ పొత్తు వెనక ఆర్‌ఎస్‌ఎస్ నేత గురుమూర్తి సలహాలు కీలక పాత్ర పోషించినట్లు చెప్తున్నారు. ఈ వ్యూహం దక్షిణాదిలో బీజేపీ విస్తరణకు ఊతమిచ్చేలా ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రిగ కజగం (టీవీకే) ఒంటరిగా నిలబడటం ఆసక్తికరంగా మారుతోంది.
విజయ్ డీఎంకేను తన ప్రధాన శత్రువుగా ప్రకటించినా, అన్నాడీఎంకేతో పొత్తు అవకాశాలు బీజేపీ ఎంట్రీతో సన్నగిల్లాయి. మైనార్టీ, దళిత ఓట్లపై ఆశలు పెట్టుకున్న విజయ్‌కి.. రెండు కూటములు ఆధిపత్య రాజకీయాలు సవాల్‌గా మారాయి. డీఎంకే-కాంగ్రెస్ కూటమి బలంగా ఉండగా, బీజేపీ-అన్నాడీఎంకే కలయిక వ్యతిరేక ఓటును ఏకం చేసేలా కనబడుతోంది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ పొత్తును స్వాగతిస్తూ, తమిళనాడు అభివృద్ధికి ఈ కూటమి బాటలు వేస్తుందని ప్రకటించారు. ఈ కూటమి డీఎంకే విజయావకాశాలను దెబ్బతీస్తుందా, లేక విజయ్ ఒంటరి పోరు కొత్త ట్విస్ట్ ఇస్తుందా? సమయమే సమాధానం చెప్పాలి.