Delhi Bomb Blast: దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది, ప్రజల్లో భయం మొదలైంది. ముఖ్యంగా ఎర్రకోట దగ్గర ఒక కారులో ఈ పేలుడు జరిగింది. దీనికి కొద్ది దూరంలోనే ఉన్న మెట్రోస్టేషన్ వద్ద కూడా మరో కారు బ్లాస్ట్ అవ్వడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ పేలుళ్ల కారణంగా ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి, అలాగే ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలాన్ని చుట్టుముట్టారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేశారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
ఈ రోజు ఉదయం ఢిల్లీ శివార్లలో పోలీసులు పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఈ ఆపరేషన్‌లో ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఈ భారీ పేలుడు సంభవించడం గమనార్హం. దీని వెనుక ఉగ్రవాదుల కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ వరుస సంఘటనలతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.

