Bhatti vikramarka: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)లో మోతిలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్‌ను శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో ఎవరూ ఊహించని రీతిలో పెట్టుబడులు పెడుతోందని తెలిపారు.
విద్యలో పెట్టుబడి పెట్టడం ద్వారానే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని మా ప్రభుత్వం నమ్ముతోందని స్పష్టం చేశారు. కళాశాల చదువు పూర్తయిన తర్వాత విద్యార్థులు వెంటనే ఉద్యోగాలు పొందేలా స్కిల్ యూనివర్సిటీ సిలబస్ రూపొందించి అమలు చేస్తున్నట్టు తెలిపారు. పారిశ్రామిక వేత్తల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఆ సిలబస్‌ను సిద్ధం చేస్తామన్నారు.
యువ రాష్ట్రమైన తెలంగాణ ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడుతోందని, రాష్ట్ర అభివృద్ధిలో ఐఎస్‌బీ విద్యార్థులు కూడా భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను ఉచితంగా అందించేందుకు ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ను ప్రారంభించనున్నట్టు ప్రకటించారు.
అలాగే రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ఐఎస్‌బీలో ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు నిర్వాహకులను సూచించారు.