Bhadradri Kothagudem: నగదు కాదు, నగలు అసలే కాదు.. మణులు, మాన్యాలు కానే కాదు.. ఓ కోడి పుంజు పోయిందని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తికి పోలీసులు ఏకంగా కరెంట్ షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చిన ఘటన కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ఆవేదనతో వెల్లడించిన వీడియో వైరల్‌గా మారింది.
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారంవారిగూడెం గ్రామానికి చెందిన కలపాల నాగారాజు అనే వ్యక్తి తన కోడిపుంజును చోరీ చేశాడంటూ అదే గ్రామానికి చెందిన అప్పారావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఏఎస్ఐ, ఇతర పోలీస్ సిబ్బంది నాగరాజును పోలీస్‌స్టేషన్‌కు రప్పించి, వారం రోజులుగా వేధింపులకు దిగారు. తనకేమీ తెలియదని చెప్తున్నాకొద్దీ నాగరాజుకు పోలీస్ లాఠీ దెబ్బలు పెరుగుతూ వచ్చాయి.
Bhadradri Kothagudem: కోడి పుంజు దొంగతనం ఒప్పుకోవాలని ఏకంగా పోలీసులు తీవ్రమైన ట్రీట్‌మెంట్ ఇచ్చారు. నాగరాజును విపరీతంగా కొట్టడమే కాకుండా, కరెంట్ షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారని నాగరాజు, అతని భార్య ఈ మేరకు చెప్పారు. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన నాగరాజును ఆయన భార్య అశ్వరావుపేట ప్రభుత్వాసుప్రతికి తీసుకెళ్లగా, ప్రథమ చికిత్స అందించిన డాక్టర్లు.. మెరుగైన వైద్యం కోసం సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు.
Bhadradri Kothagudem: ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగరాజు ఆసుప్రతిలో ఉండగా, మీడియా పలుకరించగా, మాట్లాడలేని స్థితిలో తనకు జరిగిన అన్యాయాన్ని, పోలీసుల నిర్వాకాన్ని ఏకరువు పెట్టాడు. వణుకుతూ, ఎండుతున్న నోటిని తడుపుకుంటూ చెప్తున్న వైనంపై చూపరులకు జాలి కలిగింది. పిలిచి విచారించామే తప్ప, తాము చిత్రహింసలు పెట్టలేదని, షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వలేదని పోలీసులు చెప్పడం గమనార్హం. మరి నాగరాజుకు తగిలిన దెబ్బలకు కారణమేమిటో పోలీసులే చెప్పాలి మరి.