Betting Apps: బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ పరంగా బెట్టింగ్‌కు అనుమతులు లేకపోయాయి. దీంతో చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు పక్కదారులు తొక్కతున్నారు. వారికి వివిధ సోషల్ మీడియా వేదికల నుంచి నగదు వస్తుంటుంది. కానీ, అత్యాశకు పోయిన కొందరు ఈ బెట్టింగ్ యాప్‌లకు మొగ్గుచూపి ఎందరో జీవితాలను బలితీసుకుంటున్నారు. వారేమో కోట్లల్లో సొమ్ము చేసుకుంటున్నారు.
Betting Apps: తెలంగాణ రాష్ట్రంలో ఈ బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి ఏడాది కాలంలో సుమారు 1,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు లెక్కలే చెప్తున్నాయి. ఇంకా ఎందరో మానసిక వేదనకు కుంగిపోయారు. ఇంకా వేలాది మంది తమ ఆస్తులను కోల్పోయి బికారీలుగా మారిపోయిన సంఘటనలు ఉన్నాయి. కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అయ్యాయి. ఇలా ఎందరో జీవితాలను నాశనం చేసిన ఈ బెట్టింగ్ యాప్స్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తున్నది.
Betting Apps: లక్షలాది మంది ఫాలోవర్లను ఆసరా చేసుకున్న కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్‌లు ఇచ్చే నగదుకు ఆశపడి తమ ఫాలోవర్లను బెట్టింగ్ వైపు మొగ్గుచూపేలా నమ్మబలుకుతున్నారు. తాము లాభపడ్డామని, మీరూ లాభపడతారని, చూస్తుండగానే ధనవంతులు అవుతారని చెప్పేస్తారు. నమ్మిన ఎందరో అమాయకులు ఆ బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో పడి ఉన్నదంతా పోగొట్టుకొని నాశనం అవుతున్నారు. దీనికి పురికొలిపే ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఉద్యమమే నడుస్తున్నది.
Betting Apps: తొలుత నా అన్వేషణ పేరిట యూట్యూబ్ చానల్ నడుపుతున్న విశాఖకు చెందిన అన్వేష్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లపై విరుచుకుపడ్డారు. ఒకదశలో అదే యూట్యూబ్ వేదికగా ఆయన యుద్ధమే చేశారు. దీనికి టీజీఎస్ ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ తోడయ్యారు. ఇద్దరూ కలిసి ప్రచారం స్టార్ట్ చేశారు. ఇప్పటికే వైజాగ్‌లో ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ను అరెస్టు చేయగా, సూర్యాపేట జిల్లాలో మరొక ఇన్‌ఫ్లుయెన్సర్‌పై కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్ల ఫాలోవర్లు కూడా వారిపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.