Sivasri Skandaprasad: బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య భార్య, ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారిణి శివశ్రీ స్కందప్రసాద్‌కు రైలు ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. తోటి ప్రయాణికుల ప్రవర్తన వల్ల తీవ్ర ఇబ్బందికి గురైన ఆమె.. ఆ ప్రయాణాన్ని ఒక “భయంకరమైన అనుభవం” (Traumatic experience)గా అభివర్ణిస్తూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రయాణించేటప్పుడు ఇతరుల ప్రశాంతతను, పర్సనల్ స్పేస్‌ను గౌరవించకపోవడంపై ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
కళాకారులుగా మాకు నిశ్శబ్దం ఎంతో అవసరం..
56 సీట్లు ఉన్న బోగీలో దాదాపు 40 మంది మధ్య వయస్కులు ఒక గ్రూప్‌గా ప్రయాణిస్తున్నారని, వారు సుమారు ఐదు గంటల పాటు ఎడతెరిపి లేకుండా బిగ్గరగా మాట్లాడటం, నవ్వడం, కేకలు వేయడంతో ప్రశాంతత కరువైందని తెలిపారు.
కళాకారులుగా మా మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతుంటాయి. మేం నిశ్శబ్దంలోనే సృజనాత్మకంగా అభివృద్ధి చెందుతాం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో గంటల తరబడి గోల భరించడం నరకంగా మారింది అని పేర్కొన్నారు. గ్రూప్‌లో లేని మిగిలిన 16 మంది ప్రయాణికులు ఆ శబ్ద కాలుష్యాన్ని భరించాల్సి రావడం దురదృష్టకరమని వాపోయారు.
టీటీఈ వచ్చినా తగ్గని హంగామా – యూనో గేమ్, బాలీవుడ్ పాటలు..
గోల భరించలేక వేరే కోచ్‌లో సీటు కేటాయించాలని రైల్వే టికెట్ ఎగ్జామినర్ (TTE)ను కోరినప్పటికీ, రైలు మొత్తం ప్రయాణికులతో నిండిపోవడంతో అదే కోచ్‌లోని మరో సీటులో కూర్చోవాల్సి వచ్చిందన్నారు.
ఇంతలో వారిలో కొందరు వ్యక్తులు ‘యూనో’ (UNO) గేమ్ ఆడటం మొదలుపెట్టారని, టీటీఈకి ఫిర్యాదు చేయగా ఆయన వారిని వారించారని తెలిపారు. అయితే కొద్ది నిమిషాలకే సదరు టీటీఈ మళ్లీ వచ్చి వారితో సరదాగా మాట్లాడటంతో.. ప్రయాణికులు ఆయనను కూడా తమతో పాటు ఆటకు ఆహ్వానించారని, ఆ తర్వాత బిగ్గరగా బాలీవుడ్ పాటలు పాడటం ప్రారంభించారని వివరించారు.
ఇక్కడ ఆటలో ఎవరు గెలిచారనేది ముఖ్యం కాదు. వారితో పాటు ఒక భారతీయురాలిగా పౌరస్పృహ (Civic sense) విషయంలో నేనూ ఓడిపోయాను. ఒక దేశంగా బహిరంగ ప్రదేశాల్లో మన ప్రవర్తనను ఎప్పుడు మెరుగుపరుచుకుంటాం?” అంటూ నిలదీశారు.
తోటి వ్యక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం శివశ్రీ స్కందప్రసాద్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారి, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో పౌరస్పృహ, తోటి ప్రయాణికుల పట్ల గౌరవం ఉండాలనే అంశంపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
