Viral News

Viral News: కొంపముంచిన యూట్యూబ్ వీడియో.. కోటి రూపాయలు, కేజీ బంగారం చోరీ..!

Viral News: సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం కొందరు చేసే పనులు ఒక్కోసారి ప్రాణాల మీదకు లేదా నిలువునా ముంచేసే ప్రమాదాలకు దారితీస్తుంటాయి. తమిళనాడులో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయని మురిసిపోతూ.. ఇంట్లో ఉన్న బంగారం, నోట్ల కట్టలను వీడియోల్లో చూపించిన ఓ యూట్యూబర్ జంటకు దొంగలు కోలుకోలేని షాకిచ్చారు. ఏకంగా కోటి రూపాయల విలువైన బంగారు నగలపై కన్నేసి లూటీ చేశారు.

వీడియోల్లో సంపదను చూపించి చిక్కుల్లో..

కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌ సమీపంలోని తమ్మట్టుకోణం విఐపి గార్డెన్‌లో వ్యాపారవేత్త వినోద్ కుమార్, మధుమిత దంపతులు ఉంటున్నారు. వీరు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు చేస్తుంటారు. వ్యూస్ ఎక్కువ వస్తున్నాయన్న ఆశతో.. మధుమిత ఇంట్లో ఉన్న 118 సవర్ల (సుమారు కిలోపైగా) బంగారు ఆభరణాలు, వజ్రాలు, కట్టల కొద్దీ నగదును వీడియోలు తీసి పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆఖరికి దొంగతనం జరగడానికి కొద్దిసేపటి ముందు కూడా పూజా గదిలో ఉన్న నగలు, సంపదను చూపిస్తూ వీరు మరో వీడియోను అప్‌లోడ్ చేశారు.

పక్కా ప్లాన్‌తో దొంగతనం..

సోషల్ మీడియాలో వీరు పెట్టిన వీడియోలను చూసిన దొంగలు.. ఆ ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేం ఉన్నాయో ముందే ఓ అంచనాకు వచ్చారు.
దంపతులు షాపింగ్ కోసం బయటకు వెళ్లిన సమయం చూసి దొంగలు ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగారు. ఇల్లు సీసీటీవీలు ఉన్న గేటెడ్ కాలనీలో ఉన్నప్పటికీ.. వెనుక తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాల్లో దాచిన కిలోకు పైగా బంగారం, వజ్రాలు, నగదును మూటగట్టుకుని పారిపోయారు. వీటి విలువ సుమారు రూ. కోటి వరకు ఉంటుందని లెక్కగట్టారు.

షాపింగ్ ముగించుకుని ఇంటికి వచ్చిన దంపతులు.. పగిలిపోయిన తలుపులు, ఖాళీ అయిన బీరువాలు చూసి గుండెలు బాదుకున్నారు. వెంటనే రాజక్కమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దొంగల కోసం గాలింపు ముమ్మరం చేశారు. సోషల్ మీడియాలో లైకుల కోసం వ్యక్తిగత విషయాలు, ఇంట్లోని సంపదను ఓపెన్‌గా చూపించడం ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఈ ఘటనే పెద్ద ఉదాహరణగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *