BCCI: ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు హ్యాండ్‌షేక్ చేసుకోకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ వివాదంపై బీసీసీఐ (BCCI) స్పందించింది. క్రికెట్ నియమావళిలో లేదా ఐసీసీ రూల్ బుక్‌లో మ్యాచ్ తర్వాత ప్రత్యర్థులతో కరచలనం చేయాలని ఎక్కడా తప్పనిసరిగా పేర్కొనలేదని బీసీసీఐలోని ఒక సీనియర్ అధికారి తెలిపారు. కరచలనం అనేది ఒక సంప్రదాయం మాత్రమేనని, ఆటగాళ్ల మధ్య సత్సంబంధాలకు చిహ్నమని, అది ఒక చట్టం కాదని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. “ఒకవేళ చట్టమే లేకపోతే, బలహీనమైన సంబంధాలు ఉన్న ఒక ప్రత్యర్థితో భారత జట్టు కరచలనం చేసుకోవాల్సిన అవసరం లేదు” అని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: Asia cup 2025: షేక్ హ్యాండ్ వివాదంలో పాక్‌కు మరో ఎదురుదెబ్బ!
భారత ఆటగాళ్లు కరచలనం చేసుకోకపోవడం వెనుక ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతలే ప్రధాన కారణమని బీసీసీఐ సంకేతాలు ఇచ్చింది. ఇది కేవలం ఆటలో భాగం కాదని, కొన్ని విషయాలు క్రీడా స్ఫూర్తి కంటే ముఖ్యమైనవని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా గతంలో పేర్కొన్నారు. భారత ఆటగాళ్లు కరచలనం చేసుకోకపోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)కి అధికారికంగా ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ను తొలగించాలని కూడా డిమాండ్ చేసింది. అటు ఐసీసీ కూడా దీనిపై స్పందించింది. ‘అందులో మ్యాచ్ రిఫరీ పాత్ర లేదని, షేక్‌హ్యాండ్ ఇవ్వాలని MCC మాన్యువల్‌లో లేదు’ అని ICC తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.