BC Reservations:

BC Reservations: బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై తీవ్ర ఉత్కంఠ‌.. నేడు సుప్రీంలో విచార‌ణ‌.. ఢిల్లీలోనే మంత్రుల బృందం

BC Reservations: స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెల‌కొన్న‌ది. ఒక‌వైపు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ముమ్మ‌రంగా ఏర్పాట్లు చేస్తుండ‌గా, మ‌రోవైపు కోర్టుల్లో కేసుల‌తో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై అనుమాన‌పు నీడ‌లు క‌మ్ముకున్నాయి. ఇదేరోజు (అక్టోబ‌ర్ 6న‌) సుప్రీంకోర్టులో కేసు విచార‌ణ‌కు రానున్న‌ది. దీంతో రాష్ట్ర ప్ర‌జానీకం, రాజ‌కీయ పార్టీలు, విశ్లేష‌కులు సైతం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

BC Reservations: 42 శాతం బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో9ని తీసుకొచ్చింది. దీనిపై ఇటు రాష్ట్ర హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీవో 9ని ర‌ద్దు చేయాలని, 42 శాతం రిజ‌ర్వేష‌న్ల అమ‌లుతో సుప్రీంకోర్టు నిబంధ‌న‌ను అతిక్ర‌మించి 50 శాతం రిజ‌ర్వేష‌న్‌ ప‌రిమితిని దాటిన‌ట్ట‌వుతుంద‌ని పిటిష‌న‌ర్లు పేర్కొన్నారు.

BC Reservations: ఈ మేర‌కు రాష్ట్ర హైకోర్టులో వేసిన పిటిష‌న్‌పై ఈ నెల 8న విచార‌ణ జరుగుతుండ‌గా, సుప్రీంకోర్టులో వేసిన పిటిష‌న్‌పై అక్టోబ‌ర్ 6న విచారించ‌నున్న‌ట్టు ధ‌ర్మాసనం పేర్కొన్న‌ది. విచార‌ణ‌లో భాగంగా రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని అత్యున్న‌త న్యాయ‌స్థానం తేలుస్తుందా? లేక వాయిదా వేసి సాగ‌దీస్తుందా? రాష్ట్ర ప్ర‌భుత్వం పెంచిన రిజ‌ర్వేష‌న్ల జీవోను ర‌ద్దు చేస్తుందా? అన్న అంశాల‌పై తీవ్ర ఉత్కంఠ నెల‌కొన్న‌ది.

BC Reservations: సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలోనే తిష్ట‌వేసింది. డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌, పొన్నం ప్ర‌భాక‌ర్‌, వాకిటి శ్రీహ‌రి ఒక‌రోజు ముందే రాజ‌ధాని న‌గ‌రానికి చేరుకున్నారు. జ‌రిగే ప‌రిణామాల‌పై న్యాయ కోవిదుల‌తో చ‌ర్చిస్తున్నారు. తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై అక్క‌డే తెలంగాణ భ‌వ‌న్‌లో ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చించారు. విచార‌ణ స‌మ‌యంలో కోర్టుకు హాజ‌ర‌వుతారని స‌మాచారం.

BC Reservations: ఇదిలా ఉండ‌గా, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఇప్ప‌టికే షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. హైకోర్టు విచార‌ణ అనంత‌రం అక్టోబ‌ర్ 9న ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈలోగా ఎన్నిక‌ల విధి విధానాల‌ను ప్ర‌క‌టించి, అన్నింటినీ సిద్ధం చేసి ఉంచింది. రిజ‌ర్వేష‌న్ల‌పై కోర్టులు అభ్యంత‌రాలు తెలిపితే, పార్టీ ప‌రంగానైనా రిజ‌ర్వేష‌న్లు కల్పిస్తూ ఎన్నిక‌లు నిర్వ‌హించి తీరాల్సిందేన‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ట్టుద‌ల‌గా ఉన్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *