BBC: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాన్ని వక్రీకరించినందుకుగాను ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ (BBC) చివరకు తలవంచింది. తమ ‘పనోరమా’ డాక్యుమెంటరీ ఎపిసోడ్‌లో ట్రంప్ ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించే విధంగా సవరించినట్లు అంగీకరిస్తూ ఆయనకు క్షమాపణలు తెలియజేసింది.
అయితే, బీబీసీ చైర్మన్ సమీర్ షా స్వయంగా వైట్ హౌస్‌కు లేఖ రాసి క్షమాపణ కోరినప్పటికీ, ట్రంప్ డిమాండ్ చేసిన పరువు నష్టం పరిహారాన్ని మాత్రం చెల్లించేందుకు నిరాకరించింది. పరిహారం కోరేందుకు ఈ వివాదంలో ఎటువంటి ఆధారం లేదని బీబీసీ ఖరాఖండిగా తేల్చి చెప్పింది.
వివాదానికి కారణం ఏంటి?
2021లో ట్రంప్ మద్దతుదారులు కాపిటల్ భవనాన్ని ముట్టడించిన రోజున ట్రంప్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను బీబీసీ తమ డాక్యుమెంటరీలో సవరించింది.
మా సవరణ… అధ్యక్షుడు ట్రంప్ హింసాత్మక చర్యకు ప్రత్యక్ష పిలుపునిచ్చారనే తప్పుడు అభిప్రాయాన్ని కలిగించింది. దీనిపై మేము హృదయపూర్వకంగా విచారం వ్యక్తం చేస్తున్నాము అని తెలిపింది. ఈ వివాదాస్పద డాక్యుమెంటరీని ఇకపై తిరిగి ప్రసారం చేయబోమని కూడా స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: ఢిల్లీ బాంబు బ్లాస్ట్.. బాంబర్ ఉమర్ నబీ ఇంటిని పేల్చేసిన అధికారులు
బీబీసీ క్షమాపణలు చెప్పినప్పటికీ, పరువు నష్టం దావాకు ఆధారం ఉందని తాము తీవ్రంగా విభేదిస్తున్నామని, జరిగిన పొరపాటు కేవలం “తీర్పు లోపం (Error of Judgment)” మాత్రమేనని పేర్కొంటూ పరిహారం చెల్లింపును తిరస్కరించింది.
ట్రంప్ పరువు నష్టం దావా వేస్తారా?
బీబీసీ క్షమాపణలు చెప్పినప్పటికీ, ట్రంప్ న్యాయ బృందం మాత్రం తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. ట్రంప్ న్యాయవాదులు పంపిన లేఖకు నవంబర్ 14, శుక్రవారం వరకు బీబీసీకి గడువు ఇచ్చారు. బీబీసీపై ఇప్పటివరకు ఎటువంటి దావా నమోదు కాలేదని ట్రంప్ తరపు న్యాయవాదులు గురువారం స్పష్టం చేశారు. బీబీసీ పరిహారాన్ని తిరస్కరించిన నేపథ్యంలో, డొనాల్డ్ ట్రంప్ న్యాయ బృందం గడువులోగా కోర్టులో దావా వేస్తుందా లేదా అనేది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది.

