Bank Robbery: బ్యాంకులో లోను శాంక్షన్ కాకపోతే మీరేం చేస్తారు. వేరే బ్యాంకులో ట్రై చేస్తారు. మరీ తప్పనిసరి అనుకుంటే ప్రయివేట్ వ్యక్తుల వద్ద అప్పుకోసం ప్రయత్నిస్తారు. అదీ దొరకకపోతే అవసరాలను ఎదో విధంగా వాయిదా వేసుకుని.. తరువాత ఎలా సమస్యను పరిష్కరించాలో ఆలోచిస్తారు. అంతేకాదా! కానీ, ఓ పెద్ద మనిషి తనకు బ్యాంకు లోన్ ఇవ్వలేదని ఉక్రోషంతో బ్యాంకుకే కన్నం వేశేశాడు. తన లోన్ ఎమౌంట్ అంత బంగారం దోచుకుని పోయాడు. అలా దొంగతనం చేస్తే ఊరుకుంటారేంటీ.. బ్యాంకు పోలీసులకు కంప్లైంట్ చేయడం వాళ్ళు మనోడ్ని అరెస్ట్ చేయడం చక చకా జరిగిపోయాయి. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. బ్యాంకు దొంగతనానికి ఈ ఘనుడు ఒక సినిమా చూసి దానిలో ఉన్నట్టే చేయడం. విషయం విన్న పోలీసులు ముక్కున వేలేసుకున్నారు! ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని దావణగెరె జిల్లాకు చెందిన విజయ్‌కుమార్ (30 సంవత్సరాలు) ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అతను ఆగస్టు 2023లో SBI బ్యాంక్‌లో రూ. 15 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు, కానీ అతని అప్లికేషన్ రిజెక్ట్ అయింది. దీంతో కోపం వచ్చిన అతను బ్యాంకు నుంచి రూ.13 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకున్నాడు. స్పానిష్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘మనీ హీస్ట్’ సినిమా చూడడంతో అతనికి ఈ దొంగతనం ఐడియా వచ్చింది. ఆ తరువాత దీనిమీద చాలా వర్క్ చేశాడు. దాదాపు ఆరునెలల పాటు యూట్యూబ్ లో వీడియోలు చూసి బ్యాంకు దొంగతనానికి స్కెచ్ వేశాడు. బ్యాంకును దోచుకోవడంలో, అతను తన సోదరుడు అజయ్‌కుమార్, బావమరిది పరమానంద్, మరో ముగ్గురు సహచరులు అభిషేక్, చంద్రు,మంజునాథ్‌ల సహాయం కూడా తీసుకున్నాడు.
Bank Robbery: స్కెచ్ ప్రకారం విజయ్‌కుమార్, చంద్రు బ్యాంకులో అనేకసార్లు తనిఖీలు నిర్వహించారు. పోలీసులు అంచనా వేయలేని విధంగా వారు ప్రజలు ఎక్కువగా తిరుగాడని పొలాల గుండా బ్యాంకుకు వెళ్లడానికి రాత్రిపూట మాక్ డ్రిల్ నిర్వహించారు. దీని తరువాత ఆ ముఠా కిటికీ ద్వారా బ్యాంకులోకి ప్రవేశించింది. శబ్దం చేయని హైడ్రాలిక్ ఇనుప కట్టర్లు, గ్యాస్ కటింగ్ సాధనాలను ఉపయోగించి బ్యాంకు లాకర్లను బద్దలు కొట్టారు. ఎవరూ ఫోన్ వాడలేదు. వారు సీసీటీవీ డిజిటల్ వీడియో రికార్డర్ (DVR)ను కూడా తీసుకెళ్లారు. దీనివల్ల పోలీసులకు ఎలాంటి క్లూ లేకుండా పోయింది.
Also Read: Traffic Rules: మీ వాహనానికి పెండింగ్ చలాన్లు ఉన్నాయా? వెంటనే చెల్లించండి లేకుంటే చుక్కలే
దొరకకుండా ఉండడానికి గ్రిల్స్ కట్ చేయడం కోసం ఉపయోగించిన ఆక్సిజన్ సిలిండర్ల సీరియల్ నంబర్లను కూడా విజయ్‌కుమార్ తుడిచిపెట్టాడు. పోలీసులు దర్యాప్తు చేయడం కష్టతరం చేయడానికి ఆ ముఠా స్ట్రాంగ్ రూమ్, మేనేజర్ క్యాబిన్ సహా బ్యాంకు అంతటా కారం పొడి చల్లింది.
Bank Robbery: దొంగతనం జరిగిన తరువాత పోలీసులు వారి కోసం వెతుకులాట మొదలు పెట్టారు. ఈ లోగా ఆ ముఠా దొంగిలించిన బంగారాన్ని అమ్మడం ప్రారంభించింది. దీని నుండి వచ్చిన డబ్బును వ్యాపారం, ఇల్లు కొనడానికి ఉపయోగించారు. పోలీసు దర్యాప్తు బృందం నవంబర్- ఫిబ్రవరి నెలల మధ్య గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో నిందితుల కోసం బలంగా గాలించింది. మొత్తమ్మీద రెండు రోజుల క్రితం పోలీసులు విజయ్‌కుమార్ ఆచూకీ కనిపెట్టి వలవేసి పట్టుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో మిగిలిన అందరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.

