Bangladesh Plane Crash: భారతదేశంలోని అహ్మదాబాద్‌లో ఓ కళాశాలపై విమానం కూలిన ఘోర దుర్ఘటనను మరువక ముందే బంగ్లాదేశ్‌లోని ఓ పాఠశాలపై విమానం కూలింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 20 మంది వరకు చనిపోయినట్టు నిర్ధారించారు. ఇదే ప్రమాదంలో మరో 170 మందికి పైగా గాయాలపాలయ్యాయి. బంగ్లాదేశ్ వాయిసేనకు చెందిన ఎఫ్-7 బీజీఐ శిక్షణ విమానం నిన్న (జూలై 21) మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆ దేశ రాజధాని ఢాకాలో కుప్పకూలింది.
Bangladesh Plane Crash: ఢాకా ఎయిర్ బేస్ నుంచి టేకాప్ అయిన కాసేపటికే ఆ విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో ఒక్కసారిగా నగరంలోనే ఉన్న మైల్స్ స్టోన్ స్కూల్‌పై విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో ఆ విమానంలో ఒక పైలట్ మాత్రమే ఉన్నాడు. ఈ ప్రమాదంలో పైలట్ తౌకీర్ ఇస్లాంతోపాటు మైల్స్ స్టోన్ పాఠశాలలోని ఇద్దరు ఉపాధ్యాయులు, అదే పాఠశాలకు చెందిన 17 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.
Bangladesh Plane Crash: విమానంలో ఏర్పడిన సాంకేతిక కారణాలతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని బంగ్లాదేశ్ సైన్యానికి చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) వెల్లడించింది. ఇదే విషయాన్ని ఆ విమాన పైలట్ ఏటీసీకి సమాచారం అందించినట్టు తెలిపింది. వాస్తవంగా ఆ విమానం జనసమ్మర్థం ఉన్న ప్రాంతంలో పడాల్సి ఉండగా, పైలట్ సమయస్ఫూర్తితో ఉత్తర ఢాకా వైపు మళ్లించగా, అక్కడి స్కూల్‌పై పడిందని పేర్కొన్నది.
Bangladesh Plane Crash: ఈ విమాన ప్రమాదం సమయంలో అక్కడ భీతావహ దృశ్యం కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో 170 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వారందరినీ వెంటనే కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్‌కు, సమీపంలో ఉన్న ఇతర ఆసుపత్రులకు తరలించారు. వైమానిక దళ హెలికాప్టర్లు, అంబులెన్స్‌ల సహాయంతో వారిని ఆసుపత్రులకు తరలించారు. వారంతా ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.