Bandi sanjay: రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చామో చర్చకు రెడీ..

Bandi sanjay : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ నల్గొండ జిల్లాలో బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలను బీజేపీనే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి నిబద్ధతతో పనిచేసే క్యాడర్ అందుబాటులో ఉందని, పూర్తిస్థాయి కమిట్‌మెంట్‌తో ఎన్నికల కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఆశాజనకంగా ఉన్నాయని, ఆ స్ఫూర్తితో తెలంగాణలో కూడా పార్టీని విజయతీరాలకు చేర్చాలని సూచించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపిస్తూ, రెండు పార్టీల మధ్య లాభాపేక్షతో కూడిన ఒప్పందం ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ నేతలు వివిధ స్కాముల్లో ఉన్నా, వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలుపు కోసం బీఆర్ఎస్ లోపాయికారి మద్దతునిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్న ఈ రహస్య ఒప్పందాలను ఎండగట్టాలని బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇస్తోందని, అవి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. తెలంగాణ ప్రజలు బీజేపీ గెలుపు కోసం ఎదురుచూస్తున్నారని బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అభ్యర్థులు దొరకడంలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విద్యాశాఖకు మంత్రి లేకపోవడమే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేస్తోందని విమర్శించారు. విద్యా వ్యవస్థను అర్బన్ నక్సల్స్ చేతుల్లో పెట్టారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో తప్పిదాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. బీసీల సంఖ్య పెరగాల్సిన స్థితిలో, ఎలా తగ్గుతుందో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ స్పష్టంచేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sitare Zameen Par: అమీర్ ఖాన్ 'సితారే జమీన్ పర్'ను వీక్షించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *