Balmoor Venkat: బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టులు పెడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ పోస్టుల కారణంగా తెలంగాణలోని యువత, విద్యార్థుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు.
లేకపోతే, తెలంగాణ వ్యాప్తంగా యువత, విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తారని ఆయన గట్టిగా హెచ్చరించారు.
క్షమాపణ చెప్పకపోతే దాడులు:
గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అడ్డగోలుగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి చెత్త పోస్టుల వల్ల రాష్ట్రంలోని యువతరం, విద్యార్థులు చాలా బాధ పడుతున్నారు. బీఆర్ఎస్ వెంటనే తప్పు ఒప్పుకుని, కేటీఆర్ గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే, ఈ పోస్టులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా మా యువత, విద్యార్థులు రోడ్ల మీదకు వస్తారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యాలయాలపై, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తారు. ఈ పరిణామాలకు పూర్తిగా కేటీఆరే బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని హెచ్చరించారు.
కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలి:
ఈ అభ్యంతరకర పోస్టులకు సంబంధించి కేటీఆర్‌ను బాధ్యుడిని చేస్తూ, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. “తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కక్షపూరిత ప్రచారాలను కాంగ్రెస్ ప్రభుత్వం సహించదు. బీఆర్ఎస్ తమ పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని” ఆయన స్పష్టం చేశారు.