Balanagar Crime News: పిల్లల ఆరోగ్య సమస్యల విషయంలో భార్యాభర్తల మధ్య చెలరేగిన కలహాలు మొత్తం కుటుంబాన్నే బలి తీసుకున్నాయి. తన రెండేళ్ల కవల పిల్లలను గొంతు నులిమి చంపిన తల్లి… ఆ తర్వాత బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లోని బాలానగర్ పరిధిలో చోటుచేసుకుంది.
కవలల ఆరోగ్య సమస్యలు.. తరుచూ గొడవలు
ఏపీలోని ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన అనిల్ కుమార్, సాయిలక్ష్మి దంపతులు కొన్నేళ్లుగా బాలానగర్ పరిధిలోని పద్మానగర్ ఫస్ట్ ఫేజ్‌లో నివాసం ఉంటున్నారు. అనిల్ కుమార్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ దంపతులకు చేతన్ కార్తికేయ, లాస్యతవల్లి అనే రెండేళ్ల కవల పిల్లలు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Buss Fire Accident: రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది మృతి
పిల్లలు పుట్టినప్పటి నుంచి వారిని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. రెండేళ్లు వచ్చినా వారికి మాటలు సరిగా రావడం లేదు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో సాయిలక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురయ్యేది.
భర్త ఇంటికి రాకపోవడంతో.. తీవ్ర నిర్ణయం
శనివారం రాత్రి అనిల్ కుమార్ ఇంటికి రాలేదు. ఈ విషయంలో భార్యాభర్తలు ఫోన్‌లో తీవ్రంగా గొడవపడినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనైన సాయిలక్ష్మి (27) ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తాను నివాసం ఉంటున్న బిల్డింగ్‌లోని థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లోకి వెళ్లి చూడగా, కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యతవల్లి అప్పటికే చనిపోయి ఉన్నారు. సాయిలక్ష్మి మొదట తన ఇద్దరు పిల్లలను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసి, ఆ తర్వాత తాను సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు మూడు నిండు ప్రాణాలను బలితీసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.