Viveka Case CBI Task Over: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుదీర్ఘ దర్యాప్తు చేస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. ఇవాళ సుప్రీంకోర్టులో మాత్రం స్పష్టత ఇచ్చేసింది. ఇటీవల వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు అంశం సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన నేపథ్యంలో సుప్రీం కోర్టు సీబీఐకి ఓ ప్రశ్నని సంధించింది. ఇంకా ఈ కేసులో దర్యాప్తు జరపాల్సింది ఏమైనా ఉందా? అంటూ సీబీఐని అడగ్గా.. ఈ కేసులో తమ దర్యాప్తు ముగిసిందంటూ సీబీఐ సుప్రీంకోర్టుకు ఇవాళ తెలిపింది. నిజానికి వైఎస్ అవినాశ్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని సీబీఐ విఫలయత్నాలు చేసింది. సాధారణ విచరాణలో అవినాశ్ రెడ్డి నుండి ఏ కీలక విషయాలు రాబట్టలేకపోయింది. మరోవైపు ఈ కేసులో జగన్ మోహన్ రెడ్డి పాత్రని నిర్ధారించాల్సి ఉంది. జగన్‌కి వివేకా మరణ వార్త ఎప్పుడు తెలిసింది? మొదటగా ఆయనకు చెప్పింది ఎవరు? తదితర అంశాల జోలికి వెళ్లకుండానే సీబీఐ దర్యాప్తు ముగించింది.
వివేకా హత్య కేసులో 8 మంది నిందితులను చేర్చింది సిబీఐ. వీరిలో గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరిలను నిందితులుగా పేర్కొంటూ 2021 అక్టోబర్‌లో తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏ-5 నిందితుడిగా డి.శివశంకర్ రెడ్డిని చేరుస్తూ 2022 జనవరిలో అనుబంద ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 2023 మే నెలలో తుది ఛార్జ్ షీట్ వేసింది. అందులో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని ఏ-6గా, వైఎస్ భాస్కర్ రెడ్డిని ఏ-7గా, వైఎస్ అవినాష్ రెడ్డిని ఏ-8గా చేర్చారు. వివేకా మరణంలో గుండెపోటు థియరీ, సాక్ష్యాల చెరిపివేత, వివేకా హత్యకు కుట్ర.. ఈ మూడు కారణాలపై అవినాష్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలని అనేక సార్లు ప్రయత్నించి విఫలమైంది సిబీఐ. 2023 మే 19న అవినాష్ సిబీఐ విచారణకు హాజరవుతారని అంతా అనుకున్నారు. హైదరాబాద్ నుంచి పులివెందుల వైపు వెళ్లిన అవినాష్ రెడ్డి.. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదన్న సాకుతో సడెన్ టర్న్ తీసుకుని కర్నూల్‌కి వెళ్లిపోయారు. కర్నూల్‌లోని విశ్వ భారతి ఆస్పత్రిలో తల్లితో పాటు ఉన్న అవినాష్‌ను అరెస్ట్ చేయడానికి 2023 మే 22న సిబీఐ టీఎం అక్కడకు వెళ్ళింది. కర్నూల్ ఎస్పీ మద్దతు కోరినా.. ఆస్పత్రిలోకి ఎంట్రీయే కష్టం కావడం, అవినాష్ రెడ్డి మద్దతు దారులు ఎక్కువగా ఉండడంతో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని వెనక్కు వచ్చినట్లు సీబీఐ తన తుది ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. ఆ తర్వాత వారానికే.. అంటే 2023 మే 31న అవినాష్‌కు ముందస్తు బెయిల్ వచ్చింది. అప్పటి నుండి అవినాశ్‌ను టచ్ చేయడమే కష్టంగా మారింది సీబీఐకి.
Also Read: Venki Leaks Jagan Links: వెంకటేష్ నాయుడు పోషించిన పాత్రలు ఎన్నో!
15.3.2019న జగన్ సమక్షంలో మానిఫెస్టో కమిటీ మీటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో ఉదయం 5.30 గంటల సమయంలో ఒక వ్యక్తి వచ్చి భారతి రెడ్డి రమ్మంటునారని జగన్‌ను పిలిచాడు. అప్ స్టెయిర్‌కి వెళ్ళిన జగన్ 10 నిమిషాల తరువాత తిరిగి వచ్చి “చిన్నాన్న ఇక లేరు” అని చెప్పారు. ఇదీ… అజయ్‌కల్లం స్టేట్మెంట్‌గా సీబీఐ రికార్డు చేసిన స్టేట్మెంట్. అయితే, ఏమైందో తెలీదు కానీ ప్లేటు ఫిరాయించిన అజయ్ కల్లాం.. సాక్షిగా తన స్టేట్మెంట్‌ను తప్పుగా సీబీఐ రికార్డు చేసిందంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఎంవీ క్రిష్ణారెడ్డి ఉదయం 6.15 గంటలకు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేయడంతో వివేకా మరణం బాహ్య ప్రపంచానికి తెలిసింది. కానీ అంతకు ముందే జగన్‌కు సమాచారం ఉందని అజయ్ కల్లం స్టేట్మెంట్‌ని బట్టి అర్దం అవుతోంది. కానీ తన స్టేట్మెంట్‌ను సీబీఐ వక్రీకరించిందని అజయ్ కల్లం ప్లేటు ఫిరాయించడంతో జగన్‌ని ప్రశ్నించే అవకాశం సీబీఐకి లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన ఇదే జగన్… అధికారంలోకి వచ్చాక తన పిటీషన్‌ని ఉపసంహరించుకున్నాడు. ఆ నాటి నుండి వివేకా కుమార్తె సునీతను బెదిరింపులకు గురిచేస్తూ.. అవినాశ్‌కు పూర్తి అండదండలతో సీబీఐ విచారణ ముందుకు సాగకుండా చేసింది జగనే అన్న ఆరోపణలున్నాయి. ఏది ఏమైనా నేడు వివేకా హత్యపై దర్యాప్తు ముగిసిందని సీబీఐ పేర్కొనడంతో.. ఇక ఈ కేసులో జగన్ విచారణ లేనట్లే అంటున్నారు విశ్లేషకులు.