Vijayawada Usthav: విజయవాడ ఉత్సవ్… రాష్ట్రంలో ఏ ఒక్కరు ఈ పేరు విన్నా సరే.. అద్భుత సాంస్కృతిక సంబరం, అంతర్జాతీయ గుర్తింపు కోసం ఒక గొప్ప ప్రయత్నం కళ్ల ముందు మెదలుతోంది అనడంలో సందేహమే లేదు. అంతగా ఈ వినూత్న ప్రయత్నం.. ప్రారంభం కాకముందే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సారి విజయవాడ దసరా ఉత్సవాలు మరింత ప్రత్యేకంగా నిలుస్తున్నాయంటే.. దేశ వ్యాప్తంగా భక్తులు, పర్యాటకులు, సంగీత ప్రియులు అందరి చూపు విజయవాడ వైపే ఉందంటే.. దానికి కారణం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ కమిటీ తీసుకున్న ఇనిషియేషన్, వారి ఎఫర్ట్స్.
అయితే, వైసీపీ నేతలు ఈ ఉత్సవాన్ని రాజకీయ కక్షసాధింపుకు వేదికగా మార్చి, “వంద కోట్ల దోపిడీ” అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. నిజం ఏమిటంటే… “సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ గ్రూప్” ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ఉత్సవం పూర్తిగా ప్రైవేటు నిధులతో జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహకారం అందించడం లేదు. కేవలం సహకారం, కొన్ని రాయితీలు మాత్రమే ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. పున్నమి ఘాట్, తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాలలో 11 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. గొల్లపూడిలో 54 రోజుల పాటు ‘విజయవాడ ఎక్స్‌పో’ పేరుతో నిర్వహిస్తున్న ఈవెంట్ కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. దానికి ప్రభుత్వానికి రూ.40 లక్షలు చెల్లిస్తున్నారు. విద్యుత్ బిల్లులు, నిర్వహణ ఖర్చులు కూడా ఉత్సవ కమిటీనే భరిస్తోంది. ఎక్స్‌పోలో పాల్గొనే వారి నుంచి ఎంట్రీ ఫీజు, స్టాల్ రుసుముల ద్వారా నిర్వాహకులకు ఆదాయం సమకూరనుంది. పున్నమి ఘాట్, తుమ్మలపల్లి, ఘంటసాల వేదికలకు ప్రవేశం పూర్తిగా ఉచితం. ఇది స్వచ్ఛమైన సంకల్పంతో చేపట్టిన ప్రైవేటు కార్యక్రమం, విజయవాడ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే గొప్ప ప్రయత్నం.
Also Read: New GST: అమల్లోకి కొత్త జీఎస్టీ.. తగ్గిన ధరలు
కానీ, వైసీపీ నేతలు ఈ ఉత్సవంపై దురుద్దేశపూరిత ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. “వంద కోట్ల దోపిడీ” అని గగ్గోలు పెడుతున్న వైసీపీ నేత పోతిన వెంకట మహేశ్‌కు, ఆయన చేస్తున్న అడ్డగోలు ఆరోపణలకు వంత పాడుతున్న ఇతర వైసీపీ నేతలకు విజయవాడ ఉత్సవ్ కమిటీ చెబుతోన్న సమాధానం ఒక్కటే… ఈ ఉత్సవానికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయట్లేదని, దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలతో మాట్లాడాలని. గొల్లపూడి గ్రౌండ్ కేటాయింపుపై కోర్టులో కేసు వేసిన వైసీపీ, హైకోర్టు నుంచి చురకలు అంటించుకుంది. “ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటే మీకేంటి నొప్పి?” అంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పాటూ, ఎక్స్‌పో నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వ్యాపారులు కూడా స్టాల్స్ తీసుకుని, ఆదాయం పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. స్టాల్స్ కేటాయింపులో పారదర్శకతతో “ముందు వచ్చినవారికి ముందు” అనే విధానం అమలవుతోంది. ఇలాంటి ప్రయత్నాలు విజయవాడకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు దోహదపడుతుంటే, వైసీపీ మాత్రం అసూయతో రగిలిపోతోందని, బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఉత్సవ్ నిర్వాహకులు అంటున్నారు. వైసీపీ దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, “మా నగరం పేరు ప్రపంచస్థాయిలో వినిపించాలనే మా సంకల్పాన్ని ఎవరూ ఆపలేరు” అంటూ గట్టిగా చెబుతున్నారు విజయవాడ ఉత్సవ్ నిర్వాహకులు.