Stop Politics on Chiru

Stop Politics on Chiru: ఆయన రేంజ్ ఢిల్లీ‌… జూబ్లీహిల్స్‌ కాదు బాస్‌!

Stop Politics on Chiru: మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినీ వరల్డ్‌లో ఆయనో ఎదురులేని శక్తి. కోట్లాది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఈ హీరో, రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి, ఎదురుదెబ్బలు తిని, తిరిగి సినిమాలకే పరిమితమైనా… రాజకీయం మాత్రం ఆయన్ను వదలడం లేదు. తాను రాజకీయాలకు దూరం అని ఆయన ఎన్నిసార్లు ఎంత గట్టిగా చెప్పినా, కొన్ని పార్టీలకు ఆయన్ని తమ వైపు తిప్పుకోవాలనే ఆశ చావడం లేదు. మరికొందరు ఆయన్ను టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తూనే ఉంటారు.

చిరంజీవి రాజకీయ జీవితం సినిమా కథలా డ్రామాటిక్‌గా సాగింది. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, రాజకీయ రంగంలో సంచలనం సృష్టించారు. కానీ, ఆ ప్రయాణం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అనంతరం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, రాజ్యసభ సభ్యుడిగా కొంతకాలం పనిచేశారు. అయితే, 2018 నాటికి రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్టు చిరంజీవి ప్రకటించారు. తానుఇక రాజకీయాల్లోకి రాను అని స్పష్టంగా చెప్పారు. ప్రధాని మోదీ రాజ్యసభ సీటు ఆఫర్‌ చేసినా, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సైతం అవకాశం కల్పిస్తా రమ్మని పిలిచినా.. చిరంజీవి నిర్ణయంలో మార్పు లేదు. కానీ, రాజకీయ పార్టీలు మాత్రం ఆయన్ను వదలడం లేదు.

ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చిరంజీవి మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ఈ సమావేశం.. వ్యక్తిగతమైనదని ఆయన సన్నిహితులు చెప్పినా, రాజకీయ ఊహాగానాలు ఆగలేదు. బీఆర్ఎస్ సానుభూతిపరులు, ఆ పార్టీ మీడియా వెంటనే.. చిరంజీవి జూబ్లీహిల్స్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారంటూ పుకార్లు రేపడం మొదలుపెట్టారు. రేవంత్ ఆయన్ను రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించారంటూ ప్రచారం చేశారు. కానీ, కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ భేటీలో రాజకీయ చర్చే జరగలేదని స్పష్టం చేశాయి. ఇలాంటి పుకార్లు చిరంజీవిని అనవసరంగా రాజకీయ చర్చల్లోకి లాగుతున్నాయని, ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో చిరంజీవి సైతం తన ఆవేదనను ఓపెన్‌గానే పంచుకున్నారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని, కానీ కొందరు తనని టార్గెట్ చేస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇకపై అటువంటి విమర్శలకు తాను మాటలతో సమాధానం చెప్పననన్నారు చిరంజీవి. తన మంచి పనులే వారికి జవాబు చెబుతాయంటూ చెప్పుకొచ్చారు. మంచి చేసే వాళ్లకు తాను ఎల్లప్పుడు అండగా ఉంటానన్న చిరు.. తన సోదరులు రాజకీయాల్లో ఉన్నారని, ఇలాగే మంచి పనులు చేసుకుంటూ వెళితే.. వారికి కూడా తప్పకుండా తన సహకారం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

Also Read: Sourav Ganguly: ఎవరి కోసమూ క్రికెట్ ఆగదు.. గంగూలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా, ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు. చిరు కుమారుడు రామ్‌ చరణ్‌ గ్లోబల్‌ స్టార్‌ డమ్‌తో దూసుకెళ్తున్నారు. ఇటీవల చిరంజీవి కోడలు ఉపాసన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. చిరంజీవి రాజకీయాల్లో విఫలమైనా.. మెగాస్టార్‌గా ఆయన బ్రాండ్‌కు, గ్లామర్‌కు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. తెలుగు సినీ ఇండస్ట్రీ ఆయనకు పెద్దన్న రోల్‌ కట్టబెట్టింది. కుర్రోళ్లతో పోటీ పడుతూ విశ్వంభర లాంటి ప్రయోగాత్మక సినిమాలతో తిరిగి వెండితెరపైనా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ నేపథ్యంలో చిరంజీవి మెగా గ్లామర్‌ని, అటు రాజకీయాల్లో పవన్‌ ఎదుగుదలను అడ్డుకోవాలనుకునే వారు… ఒక పొలిటిక్‌ టూల్‌ లాగా చిరంజీవిని ఉపయోగించుకుంటున్నారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. “నేను రాజకీయాల్ని వదిలేశాను, కానీ రాజకీయం నన్ను వదలడం లేదు!” అంటూ సినిమాలో చిరు చెప్పిన డైలాగ్‌.. ఆయన జీవితంలోనూ నిజమైనట్టే కనిపిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *