Special Invity for Tirupati MLA: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో తిరుపతి ఎమ్మెల్యేని స్పెషల్ ఇన్వైటీగా నియమించడం కొన్ని ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే, 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తన కూటమిలోని జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు స్పెషల్ ఇన్వైటీ హోదా ఇప్పటివరకు కల్పించలేదు. తిరుపతి నియోజకవర్గంలో అతి పెద్ద సంస్థల్లో ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ కాగా, రెండోది టీటీడీ. టీటీడీ నిర్వహించే పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యేకి ఆహ్వనం దక్కడం లేదు. దీంతో సమస్యలను టీటీడీ యాజమాన్యం దృష్టికి తీసుకుపోలేని పరిస్థితి మరోవైపు ఉంటోంది. తప్పనిసరి పరిస్థితుల్లో తిరుమల వాసుల సమస్యలు, టీటీడీ ఉద్యోగుల ఇబ్బందులను టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తీసుకెళ్లినా, వాళ్లు పట్టించుకోని స్థితి మరోవైపు ఎదురవుతోంది.
చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యేగా జనసేన టిక్కెట్ సాధించి భారీ మెజారిటీని కైవసం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు టీటీడీ పాలకమండలిలో తనకు స్పెషల్ ఇన్వైటీగా అవకాశం కల్పించాలని కోరడంతోపాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి తన వినతిని అందచేశారు. అయితే, పదహారు నెలలు అవుతున్నా స్పెషల్ ఇన్వైటీగా ఆరణి శ్రీనివాసులకు అవకాశం దక్కలేదు.
తిరుపతిలో ప్రధానమైన విద్యా, వైద్య సంస్థలు టీటీడీ పరిధిలోనే ఉన్నాయి. ఇటీవల ముగిసిన ఇంటర్, డిగ్రీ సీట్లు, హాస్టల్ వసతి కల్పనలో విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డీలు మాత్రమే వెళ్లారే కానీ, స్థానిక ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులను మాటమాత్రానికి కూడా ఆహ్వానించలేదు. అలాగే, స్విమ్స్ ఆస్పత్రికి ఓ పెట్రోల్ యాజమాన్యం ఇరవై కోట్లకు పైగా యంత్రాలను అప్పగింత కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. ఉప రాష్ట్రపతి సీవీ రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారి దర్శనార్థం గత నెల రాగా, ఆయనకు స్వాగతం పలికి దర్శనానికి ఆయన వెంట వెళ్లిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను టీటీడీ సిబ్బంది మహద్వారం ఎదుట నిలిపేశారు. బయోమెట్రిక్ ద్వారా ఉద్యోగులు వెళ్లే మార్గంలో టీటీడీ బోర్డు సభ్యులు, మాజీ సభ్యులు వెళ్తుంటే, ఎమ్మెల్యే మౌనంగా బయట నిలబడాల్సిన పరిస్థితి ఎదురైంది. తాజాగా, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల విజయోత్సవం పేరుతో తిరుపతిలోని మహతీ ఆడిటోరియంలో సభను టీటీడీ నిర్వహించగా, ఆ సభకు కనీస పిలుపు కూడా లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ అవుతుంది.
Also Read: Gummanur Jayaram Controversy: వైసీపీ హయాంని మించి ఆ ఎమ్మెల్యే కాంట్రవర్సీలు..!
ప్రభుత్వం వచ్చిన కొత్తలో జరిగిన ఉద్యోగుల బదలీల్లో ఎమ్మెల్యే సిఫార్సులకు నామమాత్రంగానే టీటీడీ ఉన్నతాధికారులు స్పందిస్తున్నారు. ఇక, తిరుమల స్థానికుల సమస్యలపై ఎమ్మెల్యే ఇచ్చే వినతలను ఏ అధికారి పట్టించుకోవడం లేదు. తిరుమల స్థానికుల్లో మెజారిటీ జనసేన పార్టీ మద్దతుదారులు ఉన్నారు. అయినా, ఏ పని వాళ్లకు జరగడం లేదు. ముఖ్యంగా, బాలాజీనగర్ వాసుల ఇళ్లకు స్లాబ్‌లు వేసి ఇస్తామని మెగాస్టార్ చిరంజీవి హామీ ఇచ్చి, కొన్ని ఇళ్లకు స్లాబ్‌లు కూడా వేయించారు. మిగిలిన ఇళ్లకు స్లాబ్‌లు వేయిస్తామని ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చినా, ఇప్పటివరకు ఎమ్మెల్యే వినతిపై స్పందన లేదు. అలాగే, ఆర్బీసీ సెంటర్లోని 84 మంది కుటుంబాల తరలింపుపైనా స్థానికుల గోడును ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, పట్టించుకునే నాథుడు లేడు. తిరుపతిలోని టీటీడీ రోడ్ల నిర్వహణపైనా అధికారుల తీరు ఎమ్మెల్యేని పట్టించుకోని రీతిలోనే సాగుతోంది. అదే టీటీడీ పాలకమండలిలో స్పెషల్ ఇన్వైటీగా ఎమ్మెల్యేకి అవకాశం కల్పిస్తే ఈ తంతు జరిగేదా అంటూ జనసేన పార్టీ శ్రేణులు మధనపడుతున్నాయి.
తుడా ఛైర్మన్‌కు ఆగమేఘాల మీద టీటీడీ పాలకమండలిలో స్థానం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేకు పదహారు నెలలు అవుతున్నా స్పెషల్ ఇన్వైటీగా అవకాశం కల్పించకపోవడం కూటమి ధర్మానికి తూట్లు పొడుస్తున్నట్లు కాదా అన్న చర్చ తిరుపతిలో సాగుతోంది.గమనిక: అక్షర దోషాలు, కామాలు, పుల్‌స్టాప్‌లు, పంక్చ్యువేషన్ మాత్రమే సరిచేయబడ్డాయి. కంటెంట్‌కు ఎలాంటి మార్పు జరగలేదు.

