Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్‌సీపీ గడ్డు పరిస్థితిలో ఉంది. 2024 ఎన్నికల ఘోర పరాజయం తర్వాత, పార్టీని పునర్వ్యవస్థీకరించే ప్రయత్నంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు కార్యకర్తల నుంచి సీనియర్ నేతల వరకూ అందరినీ అసహనంలోకి నెట్టేస్తున్నాయి. అందులోనూ, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి నియామకం ఆ పార్టీలో అగ్నిపర్వతాన్నే రగిల్చింది. “రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలని” చందంగా ఉందంటూ… సజ్జలను మళ్లీ తెరపైకి తెచ్చిన జగన్ నిర్ణయంపై ఆ పార్టీ అనుకూల మీడియాలు సైతం నెత్తి నోరీ బాదుకుంటోంది.
సజ్జల—గత ఐదేళ్లూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంతా తానై వ్యవహరించిన నేత. ప్రభుత్వ సలహాదారుగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సకల శాఖల ‘సూపర్ మంత్రి’గా పేరు తెచ్చుకున్న ఆయన, జగన్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితం చేశారనే విమర్శలు బలంగా ఉన్నాయి. చంద్రబాబు, పవన్, లోకేష్‌పై దాడుల స్క్రిప్ట్ రాసినా, సోషల్ మీడియాలో కుమారుడు భార్గవ రెడ్డితో వైరల్ చేయించినా, సజ్జల చుట్టూనే పార్టీ తిరిగింది. కానీ, ఫలితం? 175/175 అనే భ్రమలో మునిగిన వైసీపీ, 11 సీట్ల వద్ద పైకి తేలింది. ఈ ఓటమికి సజ్జల వ్యూహాలే కారణమని కార్యకర్తల నుంచి రీజనల్ కోఆర్డినేటర్ల వరకూ లబోదిబోమంటున్న పరిస్థితి. అయినా, జగన్ కళ్లు తెరవలేదని ఆ పార్టీ అనుకూల మీడియా విరుచుకుపడుతోంది.
వైసీపీ పీఏసీ జాబితా 33 మంది సీనియర్ నేతలతో రూపొందింది. అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి కీలక నేతలు లేకపోయినా, సజ్జలను కన్వీనర్‌గా నియమించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. దీంతో “మేం పార్టీని ఉండాలా, వద్దా?” అని రీజనల్ కోఆర్డినేటర్లు జగన్ ఓఎస్‌డీకి ఫోన్లు చేసి నిలదీస్తున్నారట. సజ్జల వల్లే పార్టీ ఈ దుస్థితిలో ఉందని, సజ్జల వల్లే విజయసాయి రెడ్డి, కోటంరెడ్డి లాంటి నేతలు వైసీపీని వీడారని వైసీపీ క్యాడర్, లీడర్లలో గుసగుసలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ అనుకూల మీడియా కూడా “సజ్జల శల్య సారథ్యమే పార్టీని ముంచింది” అంటూ గట్టిగా రాస్తోంది. కానీ, జగన్ మాత్రం “నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు” అన్నట్టు, మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా వెళ్లిపోతానంటూ సజ్జలపై గుడ్డి నమ్మకంతో ముందుకెళ్తున్నారన్న అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
Also Read: Kadapa Tammullu: చంద్రబాబు డెడ్‌లైన్..వేటు ఎవరిపై అంటే..
Sajjala Ramakrishna Reddy: ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందనీ, వైసీపీని లేపేందుకు ఇదే మంచి అవకాశం అని ఫ్యాన్ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ, సజ్జలకు తాళాలు అప్పగించడం వల్ల “మళ్లీ అధికారం వస్తే సజ్జలే సీఎం” అనే భయం కార్యకర్తల్లో నెలకొంటోందట. పార్టీకి పునర్జన్మ ఇవ్వాలంటే కొత్త రక్తం కావాలి, పాత సారా కాదని హితవు చెబుతున్నా, జగన్ మాత్రం సజ్జల చేతిలోనే పార్టీని ఉంచారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. ఈ నిర్ణయం వైసీపీకి పూర్వ వైభవం తెస్తుందా? లేక మరింత లోతుల్లోకి నెట్టేస్తుందా? వేచి చూద్దాం.

