Sai Reddy Seat: ఏపీలో వైసీపీ రాజ్యసభ సభ్యులు ముగ్గురు రాజీనామా చేయగా ఆ మూడు రాజ్యసభ స్థానాలు ఒకటి బీజేపీకి, రెండు టీడీపీకి దక్కాయి. రాజీనామా చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో ఆర్ కృష్ణయ్య తిరిగి బీజేపీ నుంచి రాజ్యసభ సీటు దక్కించుకున్నారు. అలాగే రాజీనామా చేసిన మరో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు సైతం టీడీపీలో చేరి తిరిగి తన రాజ్యసభ సీటును తానే దక్కించుకున్నారు. ఇక రాజీనామా చేసిన మరో వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ సీటు టీడీపీ తరఫున సానా సతీష్‌కు దక్కింది.
తాజాగా వైసీపీ మరో రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో మరో ఖాళీ ఏర్పడింది. అది కూడా టీడీపీకే దక్కే అవకాశాలే ఎకువగా కనబడుతున్నాయి. జనసేన కూడా కోరుకుంటున్నప్పటికీ ఈ దఫా ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే రాజ్యసభ రేస్‌లో ఉన్న జనసేన నేత నాగబాబుకు ఇప్పటికే ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన్ని త్వరలోనే క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు. కాబట్టి ఇక జనసేనకు రాజ్యసభ చాన్స్ లేనట్లే అని తెలుస్తోంది. ఇక టీడీపీలో రాజ్యసభ రేస్‌కు పోటీ కొంత తీవ్రంగా ఉండే అవకాశం కనబడుతోంది. ప్రధానంగా రాయలసీమ ప్రాంతం నుండి రెడ్డి సామాజికవర్గం నేతకు పదవి వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినబడుతోంది.
Sai Reddy Seat: రాయలసీమకు చెందిన రెడ్డి సామాజికవర్గం నేతకు ఈ రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తే ఎలా ఉంటుందన్న దానిపై టీడీపీ హైకమాండ్ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. ‘రెడ్డి’ సామాజికవర్గం కాబట్టి.. తిరిగి అదే సామాజికవర్గానికి కేటాయిస్తే సామాజికవర్గ సమతౌల్యం పాటించినట్లు ఉంటుందన్న ఆలోచన టీడీపీ హైకమాండ్ చేస్తోందట. ఇక రెడ్డి సామాజికవర్గానికి రాజ్యసభ కేటాయించినట్లయితే ప్రధానంగా రేస్‌లో వినబడుతున్న పేరు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి. ఈయన కడప జిల్లాకు చెందిన కీలక టీడీపీ నాయకుడు. జిల్లా అధ్యక్షుడిగా, టీడీపీ పొలిట్‌బ్యూరో మెంబర్‌గా… పార్టీ కీలక బాధ్యతల్లో సమర్థవంతంగా రాణిస్తూ, అధిష్టానం అప్పగించిన టాస్కుల్లో విజయాలు సాధిస్తూ దూసుకెళ్తున్నారు. గత ఎన్నికల సమయంలో కూడా శ్రీనివాసుల రెడ్డికి రాజ్యసభ సీటు విషయమై హైకమాండ్ వద్ద చర్చ జరిగిందట. ఆయన ఎంపీగా పోటీచేసి ఉన్నా, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నా సునాయాసంగా గెలిచేవారన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ఉంది.
Also Read: Leaders Flight Problems: ‘ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ’ ట్వీట్ వెనుక..
అయితే తన సతీమణి రెడ్డప్పగారి మాధవి రెడ్డికి అధిష్టానం కడప అసెంబ్లీ సీటు కేటాయించడంతో.. గత ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించి, అత్యంత కీలకమైన కడప అసెంబ్లీ గడ్డపై టీడీపీ జెండా ఎగరవేయడంతో పాటూ.. ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లను కూటమి అభ్యర్థులు గెలుచుకోవడంలో ప్రధాన పాత్ర పోషించి… ఆర్థిక, అంగబలాల విషయంలో పార్టీకి వెన్నుదన్నుగా వ్యవహరించారు. ఉమ్మడి కడప జిల్లాతో పాటూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి క్లీన్ స్వీప్ చేయడంతో.. శ్రీనివాసులరెడ్డికి రాజ్యసభ పదవి వరించే అవకాశం ఉందని మొదటి నుంచీ చర్చ నడుస్తోంది. శ్రీనివాసుల రెడ్డి కూడా ఇప్పటికే తన మనసులో కోరికను అధినేత చంద్రబాబు వద్ద వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. కడప జిల్లాతో పాటూ రాయలసీమలో టీడీపీకి ఇప్పుడున్న బలాన్ని కొనసాగించడంతో పాటూ పూర్తి ఆధిపత్యం సాధించేందుకు… రెడ్డి సామాజికవర్గం నుండి రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డికి పెద్దల సభ సభ్యత్వం కల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్న చర్చ హైకమాండ్‌లో నడుస్తున్నట్లు రాజకీయ వర్గాల భోగట్టా.
Sai Reddy Seat: మరోవైపు కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన పార్టీకి రాజ్యసభ ప్రాతినిధ్యం కల్పించడం అవసరమే కాదు, పొత్తు ధర్మం కూడా. ఈ నేపథ్యంలో తర్వాత భర్తీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాల్లో జనసేనకు ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక ఇదే సమయంలో టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ యనమల రామకృష్ణుడికి కూడా ఏదైనా రాజ్యాంగబద్ద పదవి కల్పించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై బీజేపీ అధిష్టానంతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే రాజ్యసభ సీటు విషయంలో రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డితో పాటూ.. మాజీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ రాజ్యసభ సభ్యుడు కంబంపాటి రామ్మోహన్ వంటి నేతల పేర్లు వినబడుతున్నాయి. మరి విజయసాయిరెడ్డి కారణంగా ఖాళీ అయిన రాజ్యసభ స్థానం రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డికే దక్కుతుందా? లేదా సమీకరణాలు మారి మరెవరికైనా అవకాశం లభిస్తుందా? తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.

