Revanth vs Ktr : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు అనే నానుడి ఉంది. ఎంతటి రాజకీయ బద్ద శత్రువులైన రాజకీయ ప్రయోజనాలు, అవసరాల కోసం కొన్ని సందర్భాల్లో ఒక్కటి కావాల్సి వస్తుంది. వారిని కలిపే వేదిక ఒకటి సిద్ధమవుతుంది. అలాంటిదే “ది చెన్నై పొలిటికల్ ఫైల్స్”. తెలంగాణ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారేందుకు చెన్నై వేదికైందని రాజకీయ విశ్లేషకులు, ఆయా పార్టీల నాయకుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అక్కడ పక్క రాష్ట్ర కీలక నేత ఎంట్రీ.. తెలంగాణ నేతల మైత్రికి బాటలు వేసిందని టాక్ వినిపిస్తోంది. ఏకాంత భేటీలలో పలు కీలక ఒప్పందాలు జరిగినట్టు చర్చ నడుస్తోంది.
చెన్నై వేదికగా మార్చి 22న డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో మీటింగ్ జరిగింది. దానికి తెలంగాణ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కర్నాటక నుండి డిప్యూటీ సిఎం డి.కె.శివకుమార్ అటెండ్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుండి ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ నుండి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం సీట్లు కావాలని ప్రతిపాదించారు. ఓ రాష్ట్ర నేత సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై అభ్యంతరం చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలుగజేసుకొని.. మా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిపాదనలో తప్పేముంది. సౌత్ నుండి 36 శాతం గ్రోత్ ఉంది. కేంద్రానికి ఎక్కువ పన్నుల రూపంలో ఇస్తున్నది దక్షిణాది రాష్ట్రాలే. మా ముఖ్యమంత్రి ప్రతిపాదనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్న అని కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలబడ్డారు. ఇక్కడ ఎంత తిట్టుకున్నా.. పక్క రాష్ట్రాల ముందు ఐక్యత ప్రదర్శించారు. లౌక్యంతో కూడిన పాలిటిక్స్ అంటూ రాజకీయ విశ్లేషకుల మన్ననలు పొందారు.
Revanth vs Ktr: కట్ చేస్తే… చెన్నై మీటింగ్‌కు ముందు కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌తో కేటీఆర్ ఏకాంతంగా గంట పాటు భేటీ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భేటీలో కర్ణాటక రాష్ట్ర ఇష్యూలతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరిగిందని టాక్. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలను.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏ క్షణమైనా ఇబ్బంది పెట్టే ప్రమాదముందని.. బీజేపీ ఆధిపత్యాన్ని అధిగమించాలంటే స్థానిక పార్టీల మద్దతు అవసరమనే రీతిలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పరోక్ష మద్దతు అవసరమని… ఆ మేరకు బహిరంగంగా రాజకీయ విమర్శలు చేసుకుంటూనే… అంతర్గతంగా మద్దతు ఇచ్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు. అందుకు కేటీఆర్‌కు సీఎం స్థాయిలో ఎలివేషన్ ఇవ్వాలనే ఒప్పందం కుదిరిందనే టాక్. దానికి ఉదాహరణగా తెలంగాణ అసెంబ్లీ వేదికగా జరిగిన రాజకీయ పరిణామాలను చూపుతున్నారు.
నిన్న తెలంగాణ శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా మాటల తూటాలు పేలాయి. సీఎం రేవంత్ రెడ్డి ఎలా విమర్శలు చేశాడో.. అదే స్థాయిలో కేటీఆర్ విరుచుకుపడ్డారు.
తాము రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదనీ… ఒకవేళ తాము కక్షపూరితంగా ఆలోచిస్తే.. ఈ రోజు ఇక్కడ నిలబడి ఇష్టం ఉన్నట్టు మాట్లాడేవారు కాదనీ… చర్లపల్లి, చంచల్ గూడ జైల్లో ఉండేవారనీ… నన్ను పెట్టిన డిటెన్షన్ సెల్‌లోనే పెట్టేవాడిననీ… సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల ఫ్యామిలీకి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తానని తాను ఎన్నికలకు ముందే బహిరంగ వేధికలపైనే చెప్పాననీ, తాను తలుచుకుంటే కల్వకుంట్ల కుటుంబం అంతా జైల్లోనే ఉంటుందనీ, కానీ తెలంగాణ అభివృద్ది కోసమే సంయమనం పాటిస్తున్నానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.!! తన కూతురి లగ్న పత్రిక రాసుకుంటామంటే.. నాడు బెయిల్ రానివ్వలేదని.. భావోద్వేగానికి లోనయిన సీఎం.. మీకు తగిన శాస్తి నా ప్రమాణ స్వీకారం రోజే జరిగిందంటూ.. కేసీఆర్‌కు బోన్ ఫ్యాక్షర్ అయిన విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు రేవంత్ రెడ్డి.
Also Read: Bandi sanjay: మజ్లీస్ దేశద్రోహ పార్టీ..
Revanth vs Ktr: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కూడా అదే స్థాయిలో రెచ్చిపోయారు. రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర ఉద్యమం చేసి జైలుకు పోలేదనీ పంచ్ విసిరారు. మంది ఇండ్ల మీద డ్రోన్లు ఎగరేస్తే జైలుకు పంపరా.. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో మీ భార్య, బిడ్డ ఫోటోలు తీస్తే ఊరుకుంటావా అంటూ రేవంత్‌ని ప్రశ్నించారు. తాము కూడా జైలుకు పోయొచ్చిన వాళ్లమేనని, తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జైల్లో ఉన్న సంగతి ప్రస్తావిస్తూ.. ప్రభుత్వాలు జైలుకు పంపవనీ, కోర్టులు పంపుతాయంటూ లాజిక్ లాగారు కేటీఆర్. మా ఇంట్లో మైనర్ పిల్లల్ని అన్నప్పుడు.. లేని రంకులు అంటగట్టినప్పుడు మేము బాధ పడలేదా అంటూ విరుచుకుపడ్డారు. నువ్వు బయపెడితే.. భయపడే వాళ్లు ఎవరూ లేరు ఇక్కడ.. నీతో ఏమీ కాదిక్కడ… అంటూ కేటీఆర్ మాటల దాడి చేశారు. కేసీఆర్ జాతిపిత అయితే.. రేవంత్ బూతుపిత అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఉప్పు.. నిప్పుగా ఉన్నా.. చెన్నైలో స్టాలిన్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి ప్రతిపాదనపై తాను మద్దతు తెలిపాననీ.. రాష్ట్ర పరువు గురించి రేవంత్‌కు మద్దతుగా మాట్లాడానంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.
అసెంబ్లీలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నంత సేపు కేటీఆర్ ఏమీ అనలేదు. కేటీఆర్ మాట్లాడుతున్నంత సేపు సీఎం రేవంత్ రెడ్డి ఏమీ అనలేదు. సాధారణంగా ముఖ్యమంత్రిని ఒక్క మాట అన్న వెంటనే స్పీకర్ మైక్ కట్ చేస్తారు. కానీ ఆ పరిణామం చోటు చేసుకోలేదు. కేటీఆర్‌కు పూర్తి స్థాయిలో మైక్ ఇచ్చారు. కేటీఆర్ స్పీచ్ పూర్తయ్యే వరకు సీఎం సభలోనే ఉన్నారు. తర్వాత వెళ్లిపోయారు. రేవంత్… కొన్ని అంశాల్లో కేటీఆర్ విమర్శలపై వ్యూహాత్మకంగానే దాట వేశారనీ… ‘ది చెన్నై పొలిటికల్ ఫైల్స్’ ఒప్పందం మేరకు కేటీఆర్‌కు ముఖ్యమంత్రి స్థాయిలో ఎలివేషన్ ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక సభ ముగిసే చివర్లో ముఖ్యమంత్రి మీద కేటీఆర్ అన్న మాటలు, కేటీఆర్ మీద ముఖ్యమంత్రి అన్న మాటలు… రికార్డుల నుండి తొలగించాలని ఆయా పార్టీల నేతలు పట్టు పట్టడం.. స్పీకర్ పరిశీలించి, తొలగిస్తామని చెప్పడం కొసమెరుపు.

