Rajanagaram Balaram

Rajanagaram Balaram: అధినేతకు తగ్గట్టే ఆ ఎమ్మెల్యే..

Rajanagaram Balaram: రాజకీయాల్లో మెజార్టీ ప్రజా ప్రతినిధులు అభివృద్ధితో పాటూ ఎంతో కొంత వెనకేసుకోవడానికే చూస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ జనసేన ఎమ్మెల్యే డిఫరెంట్‌. రాజానగరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా బరిలో దిగి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన బత్తుల బలరామకృష్ణ అవినీతికి తావు లేకుండా, ఒక్క రూపాయి కూడా ఎక్కడా ప్రజా ధనం ముట్టకుండా, తనతో పాటు ఏ కార్యకర్త కూడా ఎక్కడా పక్కదారి పట్టకుండా… నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే.. వెంటనే నెరవేర్చి, కూటమి నాయకులని కలుపుకుని ముందుకు వెళుతూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఒకప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం చేసి, ఇప్పుడు అప్పుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందట. అయితే, తనకు ఆస్తులు లేకపోయినా పరవాలేదనీ, సమాజంలో తన పేరు పది కాలాల పాటు అందరూ చెప్పుకోవాలనేదే తన ఆకాంక్ష అంటున్నారట ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ.

ఇటీవల జనసేన కార్యక్రమంలో ఎమ్మెల్యే తమ కార్యకర్తలను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. “రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఉన్న ఆస్తులు అమ్ముకున్న ఏకైక వ్యక్తిని నేనే. అందుకు నేను ఎక్కడా కూడా బాధపడడం లేదు. నా కార్యకర్తలు నన్ను నమ్ముకుని నాతో ఉన్నారు. నా కుటుంబం నన్ను నమ్ముకుని నాతో ఉంది. నా నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్ముకుని నాకు ఓటేశారు. ఇంత మంది నన్ను నమ్ముకుని నా వెంట ఉన్నందుకు… ఇప్పటివరకు అప్పుల్లో ఉన్నా… నా పిల్లలకు ఎటువంటి ఆస్తి ఇవ్వకపోయినా.. ఉన్నది అంతా అమ్మి అయినా.. నా కార్యకర్తలను, నా నియోజకవర్గ ప్రజలను కాపాడుకోవడమే నా ప్రధాన లక్ష్యం.” అన్నారు బలరాముడు. తాను కేవలం రాజకీయాల్లో కొనసాగుతోంది… జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి మాత్రమే అని కూడా చెప్పుకొచ్చారు.

Also Read: Karedu Indosole Story: కాష్టంలా రగులుతున్న కరేడు… అసలు నిజాలు

సొంత నిధులతో 108 అంబులెన్సులకు ధీటుగా నియోజకవర్గంలో మూడు మండలాలకు వైద్య సౌకర్యాల కోసం అంబులెన్స్ వాహనాలను ఏర్పాటు చేసిన ఘనత బలరామకృష్ణకే దక్కుతుంది. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుండి కూడా నియోజకవర్గంలో బాగా లేని రోడ్లపై స్పెషల్ ఎంక్వయిరీ చేయించి, నిధులు రప్పించి రోడ్ల అభివృద్ధికి కృషి చేశారు. రైతులకు సకాలంలో పంట నష్టం అందేలా, వారికి కావాల్సిన లోన్లు, పెట్టుబడులను సమకూరేలా ప్రత్యేక సమావేశాలు పెట్టి పనిచేశారు. గత ప్రభుత్వంలో మంచినీరు లేక పోరాటాలతో విసుగెత్తిన ప్రజలకు ప్రత్యేక ట్యాంకులతో పాటు కుళాయిలను ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు తెలుసుకునేందుకు అనునిత్యం తన జన సైనికులను గ్రామాల్లో మొహరించారు. ఇక గంజాయి, బ్లేడ్‌ బ్యాచులపై పోలీసుల సహకారంతో ఉక్కుపాదం మోపి, ఏడాదిలోనే రాజానగరాన్ని క్రైమ్‌ రహిత నియోజవకర్గంగా మార్చారు. అటవీశాఖ మంత్రి సహకారంతో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఫారెస్ట్ అకాడమీ తెచ్చిన ఘనత కూడా బత్తులకే దక్కుతుంది. కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కు ప్రత్యేక నిధులు రప్పిస్తూ రోప్ వే తీసుకొస్తున్నారు. అదేవిధంగా కనుపూరు మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధితో పాటు.. పాండవుల కొండను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నారు.

ఎమ్మెల్యే బత్తుల బలరాముడు చేపడుతున్న అభివృద్ధి పనులను, చేస్తున్న మంచిని గుర్తించకుండా అధికార పార్టీ చెప్పు చేతుల్లో నడిచే కొన్ని చానళ్లు రకరకాలుగా వక్రీకరిస్తున్నాయి కానీ, నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎమ్మెల్యే వెంటే ఉన్నారని టాక్‌. ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా… ఎమ్మెల్యే బత్తుల, ఆయన సతీమణి వెంకటలక్ష్మి… చెరో దారి ఎంచుకుని, ప్రజలకు దగ్గరై వెంటనే వారి సమస్యలు తీర్చడంతో పాటు, వారికి ధైర్యాన్ని ఇవ్వడంలో ముందుంటున్నారు. ఇలా ఎమ్మెల్యే ఎప్పుడూ ప్రజల్లో ఉండడం వల్లే.. కొంత మందికి కంటగింపుగా మారింది అంటున్నారు జనసైనికులు. అందుకే ఎమ్మెల్యేని ఏదోరకంగా ఇరికించాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఇచ్చిన మాటకి కట్టుబడి, రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ముందుకు నడపడమే తమ ధ్యేయం అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారట ఈ ఎమ్మెల్యే దంపతులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *