Purandeshwari: బీజేపీ అధ్యక్ష పదవిని మహిళకు ఇవ్వాలని ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయించింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ నేతల సమావేశంలో బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి చర్చించినట్లు తెలుస్తోంది.
మహిళా అధ్యక్షురాలి రేసులో నిర్మలా సీతారామన్‌తో పాటూ పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈసారి బీజేపీ అధ్యక్ష పదవిని మహిళకు ఇస్తే బాగుంటుందన్నది బీజేపీలో కొందరు నేతల మాట. ఈ క్రమంలో ఈసారి ఎవరిని బీజేపీ అధ్యక్ష పదవి వరిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుతం కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నారు. ఆయన పదవీ కాలం రెండేళ్ల కిందటే పూర్తయింది. కానీ, ఆయననే కొనసాగిస్తున్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, భూపేంద్ర యాదవ్ పేర్లు గట్టిగా వినిపించినా.. నడ్డానే కొనసాగుతున్నారు. ఇప్పుడు మాత్రం కొత్త చీఫ్ ఎన్నిక తప్పదు. అది కూడా ఈ నెల రెండో వారంలోనే జరగాల్సి ఉంది. మాజీ ప్రధాని వాజ్ పేయీ నుంచి ఇప్పటివరకు బీజేపీకి 11 మంది జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. మహిళలు ఎవరికీ ఈ బాధ్యతలు దక్కలేదు. అందుకనే ఈసారి మహిళకు పగ్గాలు ఇస్తారనే కథనాలు జాతీయ మీడియాలో వినిపిస్తున్నాయి.
Also Read: Minister Anagani: ప్రతి పేదవాడికి స్థలం ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పారు
Purandeshwari: నిన్నటివరకు ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్న రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు తమిళనాడుకు చెందిన వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నడ్డా, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లు నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలోనూ వీరి పేర్లే ప్రముఖంగా వినిపించాయి. ప్రధాని మోదీ ప్రస్తుతం 8 రోజుల విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగివచ్చాక నిర్ణయం తీసుకోనున్నారు.
పార్టీ చీఫ్ రేసులో తెలుగింటి కోడలు అయిన నిర్మల ముందంజలో ఉన్నట్లు చెబుతున్నారు. 11 ఏళ్లు కేంద్ర మంత్రిగా అనుభవం, 2019 నుంచి ఆర్థిక శాఖను చూస్తుండడం ఆమె నాయకత్వ ప్రతిభకు నిదర్శనం. ఇక పురందేశ్వరి 2014లో బీజేపీలోకి వచ్చారు. కేంద్రమంత్రిగా పదేళ్ల అనుభవం ఉంది. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కుమార్తెగా, హుందాతనం ఉన్న నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. గత ఏడాది ఏపీలో టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి ఏర్పాటు సమయానికి ఆమెనే ఏపీ చీఫ్. ఒకవేళ నిర్మల బీజేపీ చీఫ్ అయితే.. ఆమె స్థానంలో పురందేశ్వరి కేంద్ర మంత్రి వర్గంలోకి వెళ్తారని ఖాయంగా చెప్పొచ్చు అంటున్నారు పరిశీలకులు. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గంలో కమలహాసన్‌పై గెలిచి, సంచలనంగా నిలిచిన ఎమ్మెల్యేగా వనతి శ్రీనివాసన్ పేరును కూడా పరిశీస్తున్నట్లు సమచారం.