Promotion for Lokesh: తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది మహానాడును మే 27, 28, 29 తేదీల్లో కడప జిల్లాలోని సీకే దిన్నె గ్రామంలో ఘనంగా నిర్వహించనుంది. ఈ వేదికపై యువనేత నారా లోకేష్‌కు ప్రమోషన్ ఖాయమని, పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని సమాచారం. ప్రస్తుతం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్, పార్టీలో ఒకే నాయకుడు ఒకే పదవిలో మూడు టర్మ్‌లకు మించి కొనసాగకూడదని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నియమం తన నుంచే మొదలవుతుందని స్పష్టం చేసిన లోకేష్‌కు.. అంతకు మించిన ఉన్నత పదవి దక్కనుందని, ఆయన్ను ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం లోకేష్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ, పార్టీలో యువ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపనుంది. ఇప్పటికే టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు 50 వేల మంది ప్రతినిధులు ఈ మహానాడులో పాల్గొనేలా అత్యంత భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. 5 నుండి 10 లక్షల మంది కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఉంది. పార్టీ ఫస్ట్ నినాదంతో.. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు చాలా స్ట్రిక్ట్ ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే.. టీడీపీకి ఈ మహానాడు చాలా కీలకం. కూటమిగా 164 సీట్ల ప్రభంజనంతో, స్వయంగా 135 సీట్ల మ్యాండేట్‌తో టీడీపీ హిస్టరీలోనే మునుపెన్నడూ లేని చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాక జరుగుతోన్న తొలి ప్లీనరీ కావడం, రాష్ట్రానికి అత్యంత కీలకమైన అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాల్సిన బాధ్యత టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఉండటం.
Also Read: AP Teachers: టీచర్ల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
Promotion for Lokesh: తర్వాతి ఎన్నికల్లోనూ కూటమిగానే నిలబడాలని మిత్ర పక్షాలతో కలిసి నిర్ణయించడం, ఇక పార్టీ పగ్గాలు లోకేష్‌కు అప్పగించేందుకు సరైన సమయం కూడా ఇదేనని పార్టీ పెద్దలు భావిస్తుండటం… ఇన్ని కీలక అంశాలతో ముడిపడి ఉండటంతో.. ఈ ఏడాది మహానాడుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఎవరు అవున్నా, కాదన్నా… ఇప్పటికే పార్టీ వ్యవహారాలన్నీ లోకేషే భుజాన వేసుకున్నారన్నది వాస్తవం. ఫైనల్ డెసిషన్ చంద్రబాబుదే అయినా.. దానికి ముందు అనేక దశల్లో వ్యవహారాలు చక్కబెడుతోంది లోకేషే. ఎమ్మెల్యేల నుండి కూడా లోకేష్‌కు మద్ధతు బాగుండటం చెప్పుకోవాల్సిన మరో అంశం. దేశంలో ఎమర్జ్ అవుతున్న యువ నాయకుల్లో లోకేష్ దూసుకుపోతున్నారు. చెప్పాలంటే ఆయనదే ప్రథమ స్థానం అని పలు జాతీయ మీడియా సర్వేలే చెబుతున్నాయ్. అదే స్థాయిలో మహానాడు వేదికగా లోకేష్ పోషించబోయే రోల్‌ని ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు.
మహానాడు షెడ్యూల్‌లో మొదటి రెండు రోజులు ప్రతినిధుల సమావేశాలు, చివరి రోజు భారీ బహిరంగ సభ ఉంటాయి. పార్టీ సంస్థాగత నిర్మాణంలో మార్పులతో పాటు, రాయలసీమ అభివృద్ధి, గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చలు జరగనున్నాయి. కడపలో జరగనున్న ఈ మహానాడు, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ గడ్డపై టీడీపీ బలప్రదర్శనకు వేదిక కానుంది. లోకేష్ నాయకత్వంలో ఐటీ, విద్యా శాఖల్లో చేపట్టిన సంస్కరణలు, పార్టీలో, పాలనలో చురుకైన పాత్ర.. లోకేష్ ప్రమోషన్‌కు బలం చేకూరుస్తున్నాయి. అయితే, డిప్యూటీ సీఎం పదవిపై ఊహాగానాలు ఉన్నప్పటికీ, హైకమాండ్ ఈ అంశంపై బహిరంగ చర్చలు నిషేధించింది. మహానాడులో లోకేష్ కొత్త పాత్ర, పార్టీ వ్యూహాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మలుపు తెస్తాయో చూడాలి.