Peddireddy Covert: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో చిన్న దేవాలయాలకు కమిటీలను నియమించాలని సీఎం చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని ప్రముఖ బోయకొండ గంగమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ పదవి రేసులో చాలామంది ఆశావాహులు పోటీపడుతున్నారు. అయితే, సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వ్యక్తికే ఈ పదవిని అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, గత ఎన్నికల్లో పుంగనూరు టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి కోసం కృషిచేసిన చౌడేపల్లి మండలం ఎర్రగంగన్నపల్లెకు చెందిన లక్ష్మీపతి రాజు అలియాస్ పతి రాజు రేసులో ముందున్నారు. 2024 ఎన్నికల్లో తన సొంత నిధులతో టీడీపీ గెలుపు కోసం, అలాగే చల్లా బాబు విజయం కోసం తీవ్రంగా శ్రమించారని పార్టీ హైకమాండ్‌గా గుర్తించింది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, టీటీడీ పాలకమండలి సభ్యుడిగా అవకాశం ఇస్తారని లక్ష్మీపతి రాజు ఆశించినా, మొదటి జాబితాలో అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ఆయన బోయకొండ గంగమ్మ చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరులో వ్యాపార లావాదేవీలు ఉన్న లక్ష్మీపతి రాజుకు ఈ పదవి ఇస్తే, చౌడేపల్లి మండలంలో పార్టీని విజయవంతంగా నడిపిస్తారని పుంగనూరు ఇన్‌చార్జ్ చల్లా బాబు సీఎంకు సూచించినట్లు తెలుస్తోంది.
మరోవైపు, బోయకొండ గంగమ్మ చైర్మన్ రేసులో అదే నియోజకవర్గానికి చెందిన ఎస్.కె.వెంకటరమణారెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. 2004 ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు, ఎస్.కె.వెంకటరమణారెడ్డి క్రియాశీలకంగా పనిచేశారు. అయితే, వారిద్దరి మధ్య మనస్పర్థల కారణంగా కొంత గ్యాప్ ఏర్పడింది. తర్వాత, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎస్.కె.వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేయగా, ఎస్.కె.వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పుంగనూరు నుంచి పోటీ చేసి, సుమారు 2,200 ఓట్లు చీల్చి, టీడీపీ ఓటమికి కొంత కారణమయ్యారు. 2009లో పెద్దిరెడ్డి ఆశీస్సులతో ఎస్.కె. వెంకటరమణారెడ్డి బోయకొండ గంగమ్మ చైర్మన్ పదవి పొందారు. అటు తర్వాత, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వెంకటరమణారెడ్డి తన సతీమణి రతీ దేవిని ఆ దేవస్థాన చైర్మన్‌గా నియమించుకోవడంలో సఫలీకృతులయ్యారు.
Also Read: Revanth Reddy: కాళేశ్వరం బాగోతం బట్టబయలు చేస్తా: రేవంత్ రెడ్డి
Peddireddy Covert: అయితే, 2009-2011 మధ్య ఎస్.కె.వెంకటరమణారెడ్డి చైర్మన్‌గా ఉన్న కాలంలో, బోయకొండ గంగమ్మ దేవస్థానం అభివృద్ధి పేరుతో కర్ణాటక భక్తుల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి, వాటిని తన సొంత బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర దేవదాయ శాఖ విచారణలో ఈ ఆరోపణలు నిజమని, సాక్షాదారులతో నిరూపితమైంది. దేవస్థానం అభివృద్ధి పేరుతో చందా విరాళ పుస్తకం ముద్రించి, నిధులు సేకరించి, వాటిని తన ఖాతాలో జమ చేసుకుని వినియోగించుకున్నట్లు విచారణలో తేలింది. 2019లో ఈ అంశంపై ఆయనపై కేసు నమోదైంది. 2011లో ఫిర్యాదు రావడంతో, మూడేళ్ల పాటు విచారణ జరిగి, పోలీసులు ఆధారాలతో ఆయన దేవస్థాన నిధులను దుర్వినియోగం చేశారని నిర్ధారించారు. 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, కేసుల భయంతో 2015లో కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. అయినప్పటికీ, 2019-2024 మధ్య పుంగనూరులో టీడీపీ గెలుపు కోసం ఆయన ఎలాంటి కృషి చేసిన ఆనవాళ్లు లేవు. ఈ కాలంలో హైదరాబాద్‌లోనే ఉంటూ కాలం గడిపారని టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, మొదటి నుంచి టీడీపీ గెలుపు కోసం కష్టపడిన చౌడేపల్లికి చెందిన లక్ష్మీపతి రాజుకు బోయకొండ గంగమ్మ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని టీడీపీ కార్యకర్తలు లెక్కలు వేస్తున్నారు. పుంగనూరు ఇన్‌చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి కూడా లక్ష్మీపతి రాజుకు ఈ పదవి ఇప్పించాలని దృఢసంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు.