Congress: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్‌పై పార్టీ కఠిన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, లక్ష్మణ్ సింగ్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించినట్లు బుధవారం అధికారికంగా ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది. తక్షణమే ఈ బహిష్కరణ అమలులోకి వస్తుందని కూడా ప్రకటించింది.
రాజకీయ జీవితం – అనుభవం ఉన్న నేత
లక్ష్మణ్ సింగ్ రాజకీయాల్లో అనుభవజ్ఞుడు. ఐదు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, మూడుసార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు. అయితే ఇటీవల ఆయన పార్టీ నాయకత్వంపై పదే పదే విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆయనకు ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయినా కూడా ఆయన విమర్శలు తగ్గించకపోవడంతో, కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఈ బహిష్కరణ చర్య తీసుకుంది.
వివాదాస్పద వ్యాఖ్యలు – అసలేం జరిగింది?
ఏప్రిల్ 24న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఘటనకు నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్ సింగ్, పార్టీకి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అయన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి:
“రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రాలకి పరిపక్వత లేదు. వారి అపరిపక్వ చర్యల వల్లే దేశం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. రాబర్ట్ వాద్రా రాహుల్ బావమరిది అయినా, అతని వ్యవహార శైలి బాధాకరం. రోడ్లపై ప్రార్థనలు చేసినందుకు ఓ వర్గాన్ని నిందించడం ప్రమాదకరం. ఇలాంటి పిల్ల చేష్టలు ఎంతకాలం భరించాలి? రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన మాట్లాడే ముందు ఆలోచించాలి. జమ్ముకశ్మీర్ సీఎం ఉగ్రవాదులతో చేతులు కలిపారు” అని ఆరోపించారు.
కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘ స్పందన
లక్ష్మణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘ కార్యదర్శి తారిక్ అన్వర్ స్పందిస్తూ,
“లక్ష్మణ్ సింగ్ అన్ని హద్దులు దాటారు. రాహుల్ గాంధీ వంటి కీలక నాయకుడిపై ఈ రీతిలో వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండనీయం. ఆయనకు నోటీసులు జారీ చేయడంతో పాటు, పార్టీ నుంచి బహిష్కరించే నిర్ణయం తీసుకున్నాం” అని తెలిపారు.