Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఈ పర్యటన సందర్భంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేయడంతో పాటు, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ లోకి ప్రవేశం ఉండదని తేల్చి చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్ రెడ్డే అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రాజెక్టును కూడా తీసుకురాలేకపోయారని, అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుగా ఉన్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డి ఎప్పుడైనా నివేదిక ఇచ్చారా? కనీసం తెలంగాణకు ప్రాజెక్టు ఇవ్వాలని డిమాండ్ చేశారా? అని ప్రశ్నించారు. కేంద్ర క్యాబినెట్లో తెలంగాణ అంశాలను కిషన్ రెడ్డి ఎప్పుడైనా ప్రస్తావించారా అని నిలదీశారు. నిర్మల సీతారామన్ చెన్నైకు మెట్రో తీసుకువెళ్ళినప్పుడు, ప్రహ్లాద్ కర్ణాటకకు మెట్రో తీసుకెళ్లినప్పుడు, తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏమి తీసుకురాలేదని విమర్శించారు.
తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి ముందుకు వస్తే, వారితో కలిసి వెళ్ళేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తెలంగాణ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డితో సమీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: Mahaa Conclave 2025: బాబు స్పీడ్ కి భయపడుతున్న పక్క రాష్ట్రాలు.
Revanth Reddy: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ లోకి ఎంట్రీ లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పెద్ద ద్రోహులని మండిపడ్డారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు వారికి కాంగ్రెస్ లో ప్రవేశం ఉండదని పునరుద్ఘాటించారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కిషన్ రెడ్డి నివాసాలకు ప్రత్యేకంగా వెళ్లి వివరాలు స్వీకరించాలని హైదరాబాద్ కలెక్టర్ కు సూచించినప్పటికీ, సర్వేలో వారు వివరాలు పంచుకోలేదని తెలిపారు.
ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని సీఎం చెప్పారు. హైదరాబాద్ వచ్చాక అందరితో సంప్రదించి శాఖలు నిర్ణయిస్తామని తెలిపారు. కర్ణాటక కులగణనపై మాత్రమే అధిష్ఠానం వద్ద చర్చలు జరిగాయన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నింటినీ బయటపెడతానని, రెండు రోజుల్లో మీడియా సమావేశం నిర్వహిస్తానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించామని, 55% మేరకు ఇప్పటికే పదవులు కేటాయించామని రేవంత్ రెడ్డి తెలిపారు. సామాజిక సమానతలు ఉన్నంతవరకు నక్సలిజం ఉంటుందని, నక్సలిజం అంతం ఉండదని ఆయన పేర్కొన్నారు.