Pawan Kalyan support: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు ఉభయ సభల్లో వాడీ వేడీ చర్చలు, అనేక నాటకీయ పరిణామాల మధ్య పార్లమెంట్ ఆమోదముద్ర పొందింది. ఈ బిల్లు పేద ముస్లిమ్‌ల సంక్షేమం, వక్ఫ్ ఆస్తుల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం రూపొందిందని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిల్లుకు మద్దతు ప్రకటించారు. జనసేన ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయం ముస్లిం సమాజానికి మేలు చేస్తుందని జనసేన విశ్వసిస్తోందని పవన్ స్పష్టం చేశారు.
నిజానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ స్టాండ్ కొత్తదేమీ కాదు. 2008-09లో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన వక్ఫ్ ఆస్తులపై ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. హైదరాబాద్ పాతబస్తీలో ముస్లిం కుటుంబాలను కలిసిన అనుభవాలను పంచుకున్నారు. “వక్ఫ్ ఆస్తులు అల్లా పేరుతో పేద ముస్లిమ్‌ల కోసం రాసిచ్చినవి. వాటిని దోపిడీ చేయడం భగవంతుడికి చేసే ద్రోహం” అంటూ ఆయన అన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పవన్ అప్పటి వ్యాఖ్యలు, ఇప్పటి నిర్ణయం ఒకే దారిలో ఉన్నాయని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు.
ఏపీలోని ఎన్డీఏ కూటమి ఈ బిల్లుకు మద్దతు ఇవ్వగా.. వైసీపీ వ్యతిరేకించింది. అలాగే దేశంలో ఇండి కూటమి ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. రాజ్యసభలో పోటా పోటీగా బలాబలాలు ఉన్నప్పటికీ రెండు సభల్లోనూ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుపై 12 గంటలు లోక్‌సభలో, 14 గంటలు రాజ్యసభలో చర్చలు జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ బిల్లును “న్యాయం, పారదర్శకత వైపు చారిత్రాత్మక అడుగు”గా అభివర్ణించారు.
Also Read: Rahul Gandhi: ఆర్ఎస్ఎస్ దృష్టి ఇప్పుడు చర్చి భూములపైనే… రాహుల్ వక్ఫ్ బిల్లుపై దాడి
Pawan Kalyan support: వక్ఫ్ ఆస్తుల దోపిడీ దేశద్రోహం కంటే ఎక్కువని, అది దేవుడికి ద్రోహం చేసినట్లే అని కుండ బద్దలు కొట్టారు. ఈ సవరణ పేద ముస్లిమ్‌లకు, మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుందని, వక్ఫ్ బోర్డుల్లో ప్రాతినిధ్యం కల్పిస్తుందని పేర్కొన్నారు. పవన్ నిర్ణయంపై కొన్ని వర్గాల నుండి విమర్శలు వచ్చినా… ఆయన గత వ్యాఖ్యలు, ప్రస్తుత స్టాండ్ ఒకే విధంగా ఉండటాన్ని విమర్శకులు సైతం ప్రసంశిస్తున్నారు.
పవన్ ఆలోచనలో క్లారిటీ స్పష్టంగా కనిపిస్తోంది. వక్ఫ్ విషయంలో 15 ఏళ్ల క్రితం ఆయన చెప్పిన మాటలకు, ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలకు ఇసుమంతైనా తేడా కనిపించదు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, పేద ముస్లిమ్‌ల సంక్షేమం కోసం పవన్ నిబద్ధతతో వ్యవహరించారనీ.. నాడు, నేడు కూడా ఇదే స్పష్టం అవుతోంది. ఈ బిల్లు ఆమోదంతో భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలవనుంది.