Pawan Effect on YSRCP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్త సుడిగాలి పర్యటనలతో వైసీపీకి నిద్ర లేకుండా చేస్తున్నారా? తన బాధ్యతలైన అటవీ, పర్యావరణ శాఖలపై గట్టి పట్టు సాధించిన పవన్… తిరుపతి జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లకు గట్టి వార్నింగ్ జారీ చేశారు. “ఎర్రచందనం జోలికొస్తే తాట తీస్తాం… నలుగురు కీలక స్మగ్లర్లను త్వరలో పట్టుకుంటాం” అంటూ తనదైన శైలిలో హెచ్చరించారు. మామండూరు అటవీ ప్రాంతంలో వాచ్ టవర్ ఎక్కి పరిశీలన చేసిన పవన్… తిరుపతి గోదాముల్లో పేరుకుపోయిన 2.65 లక్షల టన్నుల దుంగలను స్వయంగా పరిశీలించారు. రూ.2వేల నుంచి రూ.5వేల కోట్ల విలువైన ఈ ఎర్రచందనం వేలం సమస్యను కూడా మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించారు. కరోనా తర్వాత అంతర్జాతీయ మార్కెట్ మందగించడంతో వేలం ప్రక్రియ నాలుగేళ్లుగా నిలిచిపోయింది. ఇప్పుడు పవన్ రంగంలోకి దిగారు. అయితే పవన్ యాక్టివిజం వైసీపీకి కంటగింపు అవుతోంది. ఆయన పుస్తకం పట్టుకుంటే మార్ఫింగ్… నడిస్తే ఫొటో షూటింగ్… ఆర్మీ డ్రస్ వేసుకుంటే సినిమా వేషం అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. తాజాగా పుస్తకం తలకిందులుగా పట్టుకుని చదువుతున్నట్లుగా ఫేక్ ఫోటో వైరల్ చేశారు. ఫ్యాక్ట్ చెక్‌లో అది మార్ఫింగ్ అని తేలింది.
Also Read: Mahesh Kumar: రెండు, మూడు రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలపై నిర్ణయం.. మహేశ్‌కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ సొంత మీడియా అయితే “ఎక్కే విమానం… దిగే విమానం” అంటూ పవన్ పనిలేక చేస్తున్న పర్యటనలుగా చిత్రీకరించింది. దివ్యాంగులు, రైతులు, జనసేన శ్రేణులు అర్జీలతో వచ్చినా పవన్ కలవలేదని అక్కసు వెళ్లగక్కింది. అయితే పవన్ మాత్రం ఇవేవీ పట్టించుకునేట్లు కనబడటం లేదు. తనదైన శైలిలో దూసుకుపోతున్నారాయన. తాడేపల్లి పోలీస్ ఫైరింగ్ రేంజ్లో గ్లాక్ 0.5 పిస్టల్‌తో రౌండ్లు పేల్చి “రియల్ ఓజీ”ని తలపించారు. సోషల్ మీడియాను షేక్ చేశారు. తనకు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ మెంబర్‌గా ప్రాక్టీసుందనీ, ఫైరింగ్ అనేది ధ్యాసతో కూడిన ధ్యానం లాంటిదని చెప్పిన పవన్… చెన్నై మద్రాస్ రైఫిల్ క్లబ్ రోజులు గుర్తుచేసుకున్నారు. పవన్ తన పర్యటనలో ఆర్మీ డ్రస్‌లో స్టయిలిష్‌గా కనిపించడం వైసీపీకి మరింత కంటగింపు అయ్యింది. పవన్ పర్యటనలు ప్రజా క్షేమం కోరి జరుగుతున్న పర్యటనలు. అందులో మంచి చెడులు మాట్లాడాలి, లేదా ప్రజా సమస్యల కోణంలో విమర్శించాలి. అంతేకానీ పవన్ కళ్యాణ్ డ్రస్సింగ్, ఇతరత్రా వ్యక్తిగత వ్యవహారాలపై పడి ఏడవడం సమంజసం అనిపించుకోదన్న విషయాన్ని వైసీపీ గుర్తించడం లేదు. గిరిజన గూడేలకు వెలుగులు, మారుమూల గ్రామాలకు రోడ్లు… ఇలా జగన్ చేయలేని పనులు పవన్ చేస్తుంటే వైసీపీకి జెలసీగా ఉందా? అన్న అనుమానం అందుకే కలుగుతోంది. ఏది ఏమైనా పవన్ పర్యటనలు వైసీపీకి నిద్రలేని రాత్రుల్ని మిగులుస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

