NLG Checkmate Backdoor: 

NLG Checkmate Backdoor: కొట్టక, తిట్టక, చెంప గిల్లినట్టుగా.. వ్యూహాత్మక చెక్!

NLG Checkmate Backdoor: కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ మార్క్ కనబడుతోందట. పీసీసీగా ఉన్న సమయంలో రేవంత్‌ను కాలు పెట్టేందుకు కూడా అనుమతి ఇవ్వని సీనియర్లు ఇప్పుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డారట. అంతేకాదు ముఖ్యమంత్రి రేసులో మేమున్నామంటూ చెప్పుకుంటూ వచ్చిన ఆ సీనియర్లు కాస్తా ఉన్న పదవి కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందట. జిల్లా పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న రేవంత్ ఒక్కొక్కరికి చెక్ పెడుతున్నారన్న చర్చ పార్టీలో జోరందుకుంది. తాజా పీఏసీ కమిటీల జాబితా, మంత్రులకు జిల్లా ఇన్‌ఛార్జ్‌ల బాధ్యతలు వంటి అంశాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయనేది రాజకీయ విశ్లేషకుల భావన.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం రేసులో ఉన్న లిస్ట్‌లో ముందుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల పేర్లు వినిపించేవి. వీరిద్దరూ చాలా సార్లు ఆ మాట చెప్పారు కూడా. ప్రస్తుతం రేవంత్ దెబ్బకు ఉన్న పదవి కాపాడుకోవాల్సిన పరిస్థితి రానే వచ్చిందని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. అయితే ఫ్యామిలీ ఈక్వేషన్స్ దృష్ట్యా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు కానీ, ఖచ్చితంగా ఇస్తామని మాత్రం అధిష్ఠానం ఆయనకు భరోసా ఇచ్చిందట. అందరికీ సమన్యాయం చేస్తామని మంత్రి పదవి దక్కని ఆశావహులకు క్లారిటీగా చెప్పారట అధిష్ఠాన దూతలు. ఎలాగూ లోకల్ బాడీ ఎన్నికలు ముగిసేసరికి ఇంకో ఆరు నెలల సమయం పడుతుంది. మంత్రుల పదవీ కాలం రెండేళ్లు దాటుతుంది. కొందరిని మంత్రి పదవి నుంచి తప్పించి ఆ పదవులను కొత్త వారికి ఇవ్వొచ్చు అనే ప్రచారం పార్టీలో సాగుతోంది. ఆ క్రమంలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పక్కన పెట్టి ఆ పోస్టునే రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినట్లయితే అన్నదమ్ములకు సమన్యాయం చేయొచ్చనే భావనతో అధిష్ఠానం ఉందనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్‌లో సాగుతోంది. అందుకే మంత్రి వెంకట్ రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారనే వాదనలు బలపడుతున్నాయి. తాజా పీఏసీ కమిటీలో కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు దక్కకపోవడం చూస్తుంటే అధిష్ఠాన నిర్ణయం వ్యూహాత్మకంగానే ఉందన్న టాక్ నడుస్తుంది పార్టీలో. ఇక తాజాగా జిల్లాలకు మంత్రులను ఇన్‌ఛార్జ్‌లుగా ప్రకటన చేసింది అధిష్ఠానం. ఆ లిస్ట్‌లోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకపోవడంపై మతలబ్ ఏంటన్న చర్చ ఇటు పొలిటికల్ సర్కిల్‌లోనూ అటు మీడియా సర్కిల్‌లోనూ గట్టిగా సాగుతోంది.

Also Read: Tirumala: టీటీడీకి రూ.కోటి విరాళం ఇచ్చిన గూగుల్ వీపీ

NLG Checkmate Backdoor: ఇక పీఏసీ కమిటీలో స్థానం పదిలం చేసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి జిల్లాల ఇన్‌ఛార్జ్‌ల బాధ్యతల దగ్గరికి వచ్చేసరికి ఆయనకు స్థానం లేకుండా పోయింది. కొత్త మంత్రులకు ఇచ్చిన ప్రాధాన్యత సీనియర్లకు ఇవ్వకపోవడం చూస్తుంటే వారికి ప్రాధాన్యత తగ్గించారన్న అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగమేనన్న టాక్ సైతం గట్టిగా వినబడుతోంది. అసలు ఈ ఇద్దరినీ పక్కన పెట్టడానికి కారణమేంటనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై అటు అధిష్ఠానం గానీ ఇటు మంత్రులు ఎవ్వరూ స్పందించలేదు. పని ఒత్తిడి కారణంగా పక్కన పెట్టారనే చర్చ కొనసాగుతోంది. కానీ అందులో వాస్తవం లేదని తెలుస్తోంది. నిజంగా పని ఒత్తిడే కారణమైతే దానిపై మంత్రులు ఎప్పుడో ప్రకటన చేసేవారే. కానీ ఎందుకు తొలగించారో వారికి కూడా తెలియని పరిస్థితి అనే టాక్ వినిపిస్తోంది. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పని ఒత్తిడి ఉందనుకుందాం. కానీ మంత్రి కోమటిరెడ్డి సంగతేంటనే ప్రశ్న తెరపైకి వస్తోంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఉన్న కరీంనగర్ ఇన్‌ఛార్జి బాధ్యతలను తుమ్మల నాగేశ్వర్‌రావుకు, వెంకట్‌రెడ్డికి ఉన్న ఖమ్మం బాధ్యతలను కొత్త మంత్రి వాకిటి శ్రీహరికి అప్పగించారు.

ఈ మార్పుల విషయాన్ని సీఎం రేవంత్‌.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, వెంకట్‌రెడ్డికి కనీసం సమాచారం ఇవ్వలేదట. కొన్ని రోజులుగా పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు చేస్తారని కొత్త మంత్రులకు వీళ్ల నుంచి పలు శాఖలను తొలగించి అప్పగిస్తారన్న చర్చ జరిగింది. ఉత్తమ్‌ నుంచి సివిల్‌ సప్లై, కోమటిరెడ్డి నుంచి సినిమాటోగ్రఫీ శాఖలను తీసి కొత్తవారికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి అనుకున్నా వీరు ఒప్పుకోకపోవడంతో కొత్త మంత్రులకు సీఎం తన వద్ద ఉన్న శాఖలనే కేటాయించాల్సి వచ్చింది. ఇక శాఖల మార్పులపై తన మాటను లెక్కచేయకపోవడంతో రేవంత్‌రెడ్డి వీరిద్దరిపై పంతం నెగ్గించుకునేందుకు ఏకంగా వారి జిల్లాల ఇన్‌ఛార్జి బాధ్యతలను తొలగించినట్టు టాక్ వినిపిస్తోంది. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇన్‌ఛార్జి మంత్రుల బాధ్యతల నుంచి తొలగించడంపై వీరిద్దరూ లోలోపల రగిలిపోతున్నారట. సీనియర్లమైన తమనే తీవ్రంగా అవమానపరిచే రీతీలో రేవంత్‌రెడ్డి వ్యవహరించడాన్ని వీరిద్దరూ జీర్ణించుకోలేకపోతున్నట్టు. పైగా వీరికి పనిభారం తగ్గించేందుకే ఇన్‌ఛార్జి మంత్రుల బాధ్యతల నుంచి తప్పించినట్టు సీఎం కోటరీ ప్రచారం చేయడం కూడా వీరికి అస్సలు మింగుడుపడడం లేదట. వీటన్నింటికీ కారణమైన సీఎం రేవంత్‌రెడ్డికి భవిష్యత్తులో సందర్భం వచ్చినప్పుడు తమ సత్తా చూపాలన్న కసితో ఉన్నారట.

Also Read: Kanwar Yatra: రెచ్చగొట్టే నినాదాలు చేస్తే ఊరుకోమ్.. యోగి కీలక నిర్ణయం

NLG Checkmate Backdoor: ఇదిలా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రుల వైఖరే వారికి డ్యామేజ్‌గా మారిందని విశ్లేషించే వాళ్లూ లేకపోలేదు. ఆ మధ్య కాలంలో మంత్రులు ఉత్తమ్, వెంకట్ రెడ్డిలపై అనేక విమర్శలు హల్చల్ చేశాయి. ప్రతీ చిన్న కార్యక్రమానికి సైతం హెలికాప్టర్ వాడకంపై ఇటు ప్రతిపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నేతల నుంచి సైతం విమర్శలు వచ్చాయి. ఈ గాలి మోటార్‌ల పంచాయితీ అధిష్ఠానం దగ్గరకు కూడా తీసుకెళ్లారట కొందరు సీనియర్లు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ ఇటు ప్రజల్లో కూడా అభాసుపాలయ్యారని ఈ ఇద్దరు మంత్రులపై అధిష్ఠానానికి పిర్యాదు చేశారట కొందరు సీనియర్లు. అందుకే వారికి ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయట.

మొత్తానికి కాంగ్రెస్ కంచుకోటలో రేవంత్ తన మార్క్ చూపిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. సీనియర్ల ఆధిపత్యానికి చెక్ పెట్టడంలో సీఎం సక్సెస్ అయినట్టేనని.. ఇక పదవుల్లో, బాధ్యతల్లో వారికి ప్రాధాన్యత తగ్గించడంతో సీనియర్ల ఇలాకాల్లో చాప కింద నీరులా రేవంత్ పట్టు సాధిస్తున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో సీఎం హవాకు సీనియర్లు బ్రేకులు వేస్తారో లేక హ్యాడ్సప్ అంటారో..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *