New Districts In AP

New Districts In AP: వైసీపీ తప్పుల్ని సరిచేసిన చంద్రబాబు!

New Districts In AP: ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అధికారిక దశకు చేరింది. ఈ ఏడాది జూలై 22న ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం తన ప్రాథమిక అధ్యయనాలను పూర్తి చేసి, 6 కొత్త జిల్లాల ఏర్పాటుకు సిఫార్సులు చేసినట్లు తెలిసింది. ఈ సిఫార్సులపై నేడు సీఎం చంద్రబాబు మంత్రి వర్గ ఉప సంఘంతో చర్చించారు. కొత్త జిల్లాలు వస్తే.. రాష్ట్రంలోని 26 జిల్లాలు కాస్తా.. 32కి పెరుగుతాయి. ఈ విభజన వల్ల స్థానిక ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ అవుతాయని అధికారులు తెలిపారు. కొత్త జిల్లాల పేర్లు, వాటి కేంద్రాలు చూస్తే… ఒకటి అమరావతి అర్బన్ జిల్లా. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలోని 29 గ్రామాలను కలిపి ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. ఇది రాజధాని అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టి, పరిపాలనా సౌలభ్యాన్ని పెంచుతుంది. రెండు మార్కాపురం. ప్రకాశం జిల్లాలోని కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, యర్రగొండపాలెం నియోజకవర్గాలను కలిపి ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. మూడు రంపచోడవరం. ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక జిల్లా, చింతూరు డివిజన్‌లోని నాలుగు మండలాలను కలిపి ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇది గిరిజనులకు సేవలు చేరువ చేస్తుంది. నాలుగు గూడూరు. నెల్లూరు జిల్లా దక్షిణ భాగానికి కొత్త జిల్లా వచ్చే ఛాన్స్ ఉంది. అయిదోది మదనపల్లె. చిత్తూరు జిల్లాలో ఒత్తిడి తగ్గించడానికి ఈ జిల్లా రావాలనే ప్రతిపాదన ఉంది. ఆరోది పలాస. శ్రీకాకుళం ఉత్తర తీరప్రాంతానికి కొత్త జిల్లా రావచ్చు.

ఈ ప్రక్రియలో మంత్రివర్గ ఉపసంఘం 13 జిల్లా కేంద్రాల్లో ఫీల్డ్ సందర్శనలు చేసింది. 200కి పైగా పిటిషన్లను సేకరించింది. స్థానిక ప్రతినిధులు, సివిక్ గ్రూపులు, పౌరుల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా సరిహద్దుల మార్పులు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అదోని వంటి పెద్ద మండలాలను పునర్విభజించాలని కూడా ప్రతిపాదించారు. కమిటీ నివేదికను ఇవాళ సీఎం చంద్రబాబుకు అందజేశారు. మంత్రి వర్గ ఉప సంఘంతో జరిగిన భేటీలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కూడా పాల్గొన్నారు. తిరిగి నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో వీటి ఆమోదం ఉంటుంది. ఆ తర్వాత అభ్యంతరాల కాలం, గెజిట్ నోటిఫికేషన్‌ల ప్రక్రియ డిసెంబర్ 31, 2025లోపు పూర్తి అవుతుంది. 2026-27 జనగణనకు ముందే ఇది జరిగేలా ప్లాన్ చేశారు.

Also Read: Brazil: నార్కో టెర్రరిజంకి వ్యతిరేకంగా భారీ ఆపరేషన్‌.. 64 మంది మృతి

ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో ప్రజల ఆకాంక్షలు నెరవేరి, పరిపాలనా సౌలభ్యం కలగాలని మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటుతో తలెత్తిన సమస్యలు పరిష్కారం కావాలని, అదే సమయంలో కొత్త ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రాథమిక నివేదిక సిద్ధం చేశామని మంత్రులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటును సరిదిద్దేలా జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపైనా, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైనా సీఎం చర్చించారు.

కొత్త జిల్లాల ఏర్పాటుపై గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం ప్రాంతీయ విభేదాలకు కారణమైందని, ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మరోవైపు భవిష్యత్‌లో చేపట్టే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరగాలని నిర్దేశించారు. రెవెన్యూ డివిజన్ల పునర్వవ్యస్థీకరణను ప్రత్యేకంగా చేపట్టాలన్నారు. పోలవరం పూర్తయిన తర్వాత ముంపు మండలాల ప్రజలు ఏ రెవెన్యూ వార్డు, ఏ నియోజకవర్గంలో ఉంటారనేదానిపైనా అధ్యయనం చేసి… దానికి అనుగుణంగా పునర్ వ్యవస్థీకరణ జరపాలన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆ ప్రాంత చిరకాల వాంఛ అని సీఎం ప్రస్తావించారు. తమ పరిశీలనకు వచ్చిన అంశాలను, ఆయా వర్గాల అభిప్రాయాలను మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు. జిల్లాల పునర్ వ్యవస్ధీకరణపై మంగళవారం జరిగిన తొలి సమావేశంలో పలు అంశాలు చర్చించిన సీఎం… ప్రతిపాదనలపై తదుపరి చర్చలకు వారంలో మరోసారి సమావేశం అవుదామని తెలిపారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *