Nara Lokesh: నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి మేఘాలు కమ్ముకుంటున్నాయి. టీడీపీ భవిష్యత్తుగా, కాబోయే ముఖ్యమంత్రిగా పిలవబడుతున్న నారా లోకేష్ కష్టం నీరుగారిపోతోందని, జిల్లా నాయకులు ఆయన ప్రయత్నాలను ఆవిరి చేస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్‌ల కఠోర శ్రమతో అధికారంలోకి వచ్చిన నేతలు, సొంత వ్యాపారాలు, మైనింగ్, ఆర్థిక వనరుల అన్వేషణలో మునిగిపోయి, పార్టీ కార్యక్రమాలను గాలికొదిలేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు జిల్లాలో హవా అంతా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన నాయకులదేనట. వారి ఆర్థిక బలం కారణంగా వారి పనులు సాఫీగా సాగుతున్నాయి కానీ, 2019 నుంచి 2024 వరకూ కష్టాలు పడిన టీడీపీ కార్యకర్తలను ఏ నాయకుడూ పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇటీవల నెల్లూరులో రొట్టెల పండుగ, వీఆర్ మున్సిపల్ హైస్కూల్ ఓపెనింగ్ సందర్భంగా మంత్రి లోకేష్ జిల్లాకు వచ్చారు. జిల్లాలో తక్కువ సమయమే ఆయన ఉన్నప్పటికీ, నిర్భయంగా నిజాలు మాట్లాడారు. కార్యకర్తలకు, నేతలు సూటిగా చెప్పాల్సింది చెప్పారు. “మంత్రులు, ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయకపోతే, మళ్లీ జగన్ వస్తే నష్టపోయేది మీరే” అని కార్యకర్తలకు స్పష్టమైన సందేశమిచ్చారు. “నేను ప్రభుత్వంలో ఉన్నా, ఒకవైపు వైసీపీని ఎదుర్కొనేందుకు రాజకీయం చేస్తున్నా, మరోవైపు రాష్ట్ర అభివృద్ధి కోసం పాలనా వ్యవహారాలు చూస్తున్నా.. విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నా. ఒక్కోసారి నిద్రకూ సమయం ఉండటం. అయినా, జగన్ రెడ్డిలా కాకుండా మన కార్యకర్తలను నేరుగా కలుస్తున్నా. గంటైనా, రెండు మూడు గంటలైనా మిమ్మల్ని కలిశాకే వెళుతున్నా” అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు. “జగన్ ఎప్పుడైనా మీతో ఫొటో దిగాడా? షేక్ హ్యాండ్ ఇచ్చాడా? అని వైసీపీ క్యాడరే అడగండీ… నాకు, జగన్ మోహన్‌రెడ్డికి తేడా తెలుస్తుంది” అంటూ తన పార్టీ కార్యకర్తలకు సూచించారు నారా లోకేష్. గత 13 ఏళ్ల తన రాజకీయ జీవితంలో కార్యకర్తలకే తొలి ప్రాధాన్యమిచ్చానని నొక్కిచెప్పారు.
Also Read: YSR Architecture Fake: జగనన్న మంచి చేస్తే ఇలాగే ఉంటుంది మరి..!
Nara Lokesh: అయితే, లోకేష్ ఇంత కష్టపడుతుంటే, నెల్లూరు టీడీపీ నాయకులు మాత్రం ఏకతాటిపైకి రావడం లేదు. ఇటీవల లోకేష్ నెల్లూరు పర్యటన సందర్భంగా జనసమీకరణలో నాయకులు విఫలమయ్యారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి వంద, రెండొందల మందిని కూడా తీసుకురాలేకపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తమ కార్యకర్తల మీటింగ్‌లో సమావేశం హాల్ నిండిపోయినా, అది లోకేష్ క్రేజ్ వల్లేనని… రోడ్లపై జనసమీకరణ దయనీయంగా ఉందని జిల్లా టీడీపీ వర్గాల్లోనే టాక్ నడుస్తోంది. నాయకులు లోకేష్‌ను పనుల కోసం, కాంట్రాక్టుల కోసం కలుస్తున్నారే తప్ప, జనసమీకరణకు ఆసక్తి చూపడం లేదని క్యాడర్‌లో చర్చ నడుస్తోంది. మరోపక్క… జగన్ పర్యటనలకు వైసీపీ నాయకులు కోట్లు ఖర్చు చేసి జనాలను తోలుకొస్తుంటే, టీడీపీ నాయకులు మాత్రం లోకేష్ వెళ్లే రూట్‌లో ఆయన కళ్లలో పడేందుకు ఫ్లెక్సీలు కట్టడం తప్ప… జన సమీకరణపై దృష్టి పెట్టట్లేదని, పట్టుమని వంద మందిని కూడా రోడ్లపై మాబ్ చేయలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో నాయకత్వం విచ్ఛిన్నమైందని, ఇలాంటి పరిస్థితులతో, ఇలాంటి నాయకత్వంతో 2029 ఎన్నికలకు వెళితే టీడీపీ నెల్లూరును కోల్పోయే ప్రమాదం ఉందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతమున్న మంత్రులతో క్యాడర్, లీడర్లను ఒక తాటిపైకి తీసుకురావడం కష్టమని, జిల్లాకు కొత్త మంత్రి అవసరమని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే, 2029లో నెల్లూరు జిల్లా టీడీపీ చేజారిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.