Nara Lokesh: నారా లోకేష్… ఏపీ రాజకీయ రణ క్షేత్రంలో విశ్వరూపం చాటుతున్న యువశక్తి! ఒకప్పుడు “రాజకీయం తెలియదు” అంటూ వైసీపీ నుంచి విమర్శలు, అవహేళనలు ఎదుర్కొన్న లోకేష్, ఇప్పుడు “ఏం రాజకీయం చేస్తున్నాడ్రా!” అని ప్రత్యర్థులనే ఆశ్చర్యపరుస్తున్నారు. నియంతృత్వం, నిర్బంధాలను ధీటుగా తట్టుకొని, తండ్రి చంద్రబాబు విజన్‌ను అనుసరిస్తూనే, తనకంటూ సొంత రాజకీయ ముద్ర పరుచుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపుతూ, మంత్రిగా సుపరిపాలన అందిస్తూ, లోకేష్ ఒక వ్యక్తి కాదు.. అణచివేయలేని శక్తి! అనిపించుకున్నారు. రెడ్ బుక్ క్రియేటర్‌గా, అక్రమార్కులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో అసాంఘిక శక్తులు చెలరేగాయి. చట్టాలను గాలికొదిలి, సామాన్యులను హింసించారు. కోడెల శివప్రసాదరావు లాంటి నేతల ఆత్మహత్యలు, హత్యలు, వేలాది కేసులతో టీడీపీ కార్యకర్తలు తీవ్ర నిర్భందం ఎదుర్కొన్నారు. గ్రామాల్లో టీడీపీ కుటుంబాలు తమ ఇళ్లలో ఉండాలంటేనే భయపడే పరిస్థితి. ఇక బయట తిరిగే స్వేచ్ఛ ఎక్కడిది? ఇక ఎన్నికల సమయంలో వైసీపీ నేతల మితిమీరిన హింసను కళ్లారా చూసిన ప్రజలు, కూటమి అధికారంలోకి వస్తే మారణహోమం తప్పదని భయపడ్డారు. కానీ, లోకేష్, చంద్రబాబులు కార్యకర్తల ఆవేశాలను అదుపులో ఉంచారు. చట్టం చూసుకుంటుందని హామీ ఇచ్చారు. హామీ మాత్రమే ఇస్తే సరిపోదని భావించిన లోకేష్… కార్యకర్తల్లో ధైర్యం, భరోసా నింపేందుకు రెడ్ బుక్‌కి అంకురార్పణ చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో రెడ్ బుక్ చూపించి, అక్రమార్కులపై చట్టబద్ధ చర్యలు తీసుకుంటామని చెబుతూ వచ్చారు. లోకేష్ చెప్పినట్లే… కూటమి అధికారంలో వచ్చాక రెడ్ బుక్ తన పని తాను చేసుకువెళ్తోంది. వల్లభనేని వంశీ లాంటి వారు జైలుకు వెళ్లారు. కొందరికి గుండె ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతూ… “రెడ్ బుక్ రాజ్యాంగం” అంటూ కలవరిస్తున్నారు. దోచుకోవడం సర్వసాధారణం అనుకున్న వైసీపీ నేతలకు, ఆ పనులకు శిక్షలు పడటం అనేది అక్రమమట! కానీ, ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం శిక్ష తప్పదని లోకేష్ రెడ్ బుక్ హెచ్చరిస్తోంది.
Also Read: Karnataka: కర్ణాటకలో బైక్ ట్యాక్సీలకు బ్రేక్: వేలాది మందికి ఉపాధి సమస్య
Nara Lokesh: విమర్శలకు కేంద్ర బిందువు నుండి వేటాడే శక్తిలా.. లోకేష్ ట్రాన్ఫర్మేషన్ వైసీపీ నేతలకు విస్మయం కలిగిస్తోంది. పాలనలోనూ అదే మెచ్యూరిటీ. చంద్రబాబు ఐటీ విజన్‌కు వాట్సాప్ గవర్నెన్స్ జోడించి, విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు నారా లోకేష్. విద్యా వ్యవస్థ సంస్కరణల్లో, యువతకు ఉద్యోగాల సృష్టిలో, ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకంగా నిలిచారు. ఆయన ప్రసంగాలు, పాలనపై అవగాహన, పరిపక్వత ప్రత్యర్థులను సైతం మెచ్చుకునేలా చేశాయి. బీజేపీ అగ్రనేతలతో సమన్వయం, కూటమి ఐక్యతను బలపరచడంలో లోకేష్ నైపుణ్యం అసాధారణం. నరేంద్ర మోడీ స్వయంగా విందుకు ఆహ్వానించడం లోకేష్ స్థాయిని చాటింది. ఇంటా, రచ్చా గెలిచిన లోకేష్… టీడీపీ భవిష్యత్తు మరో 40 ఏళ్లు సురక్షితం అని చాటారు. ప్రభుత్వంలో, పార్టీలో.. ఏడాదిలోనే ఘన విజయాలు సాధించిన లోకేష్.. వచ్చే నాలుగేళ్లలో ఇంకా ఎంతో సాధిస్తారని ప్రజలు, కార్యకర్తలు ఆశిస్తున్నారనడంలో అతిశయోక్తేమీ లేదు.