Model School Scam

Model School Scam: ఆ స్కూల్‌లో ఒక్క విద్యార్థికీ అందని ‘తల్లికి వందనం’

Model School Scam: వైద్య వృత్తిలో ఉంటూ, విద్యను వ్యాపారంగా చేసుకుని, ధనార్జనే పరమావధిగా భావించి, వేలకు వేలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ, వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమే పనిగా పెట్టుకున్నారు ఆ వైద్యుడు… అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం విజయనగరం వీధిలో ‘అమీర్ హాస్పిటల్’ నిర్వహిస్తున్న వైద్యుడు జిలానీ బాషా… పట్టణంలోని మోడంపల్లె బైపాస్ రోడ్డులో కొన్ని సంవత్సరాలుగా ‘ఐడియల్ హైస్కూల్’ పేరిట ఓ విద్యా సంస్థని సైతం నడిపిస్తున్నారు. స్కూల్‌ కరస్పాండెంట్‌గా కూడా ఆయనే వ్యవహరిస్తున్నారు. ఈ పాఠశాలలో 500 మంది వరకూ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పథకాన్ని ప్రతి ఒక్క విద్యార్థికి అందివ్వాలన్న లక్ష్యంతో ప్రతి పాఠశాలలో ఉన్న విద్యార్థుల వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఏడాది ఒక్కో విద్యార్థికి 13 వేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. అయితే ఐడియల్ హైస్కూల్లో ఉన్న ఏ ఒక్క విద్యార్థికి తల్లికి వందనం డబ్బులు జమ కాలేదు.

Also Read: Siddaramaiah: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు: పరిష్కారం కోసం విప్రో అజీమ్‌ ప్రేమ్‌జీకి సీఎం కీలక లేఖ

పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ జిలాని బాషా, పాఠశాల సిబ్బంది మొద్దు నిద్రలో మునిగి.. విద్యార్థులకు తల్లి వందనం పథకం కోసం కనీసం దరఖాస్తు చేయకుండా వదిలేశారు. విద్యార్థుల డేటాను విద్యాశాఖకు పంపకుండా నిర్లక్ష్యం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అందరు విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు తల్లుల ఖాతాల్లో జమ అయినా… ఐడియల్ హైస్కూల్లోని సుమారు 500 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. స్థానికంగా ఉన్న డిప్యూటీ డీఈవో కానీ, ఎంఈవోలు కానీ ఈ విషయం గుర్తించలేకపోయారు. ఐడియల్ హైస్కూల్లోని ఒక్క విద్యార్థికీ తల్లికి వందనం రాలేదంటే.. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని… ప్రొద్దుటూరులో ఉంటున్న ఇద్దరు అధికారులు కనీసం పరిశీలన చేయకుండా వదిలేసిన పరిస్థితి. పాఠశాల యాజమాన్యం ఎంత నిర్లక్ష్యం వహించిందో, ఆ నిర్లక్ష్యంలో డిప్యూటీ డిఈవో, ఎంఈవోల పాత్ర కూడా అంతే స్పష్టంగా కనిపిస్తోంది. తొలుత నోటీసులు జారీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు, తప్పును సరిదిద్దుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పాఠశాల యాజమాన్యానికి ఇచ్చారు. అయినా కూడా ఐడియల్‌ హైస్కూల్‌ యాజమాన్యం తీవ్ర నిర్లక్షం వహించినట్టు డీఈవో వెల్లడించారు. అన్ని అవకాశాలను ఐడియల్ పాఠశాల యాజమాన్యం తుంగలో తొక్కేసిందని తెలిపారు. దీంతో విద్యా శాఖ సీరియస్ అయింది. ప్రస్తుతానికి స్కూల్‌ యాజమాన్యం గ్రీవెన్స్‌లో అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. నిర్ణీత సమయంలో పాఠశాల యాజమాన్యం సమస్యని పరిష్కరించుకోకుంటే… పాఠశాల గుర్తింపును రద్దు చేయడమే ఆ తర్వాతి చర్య అంటూ డీఈవో శంశుద్దీన్ హెచ్చరించారు.

ఎది ఏమైనా మంత్రి లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకున్న తల్లికి వందనంపై నిర్లక్ష్యం తగదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి నిర్లక్ష్యం వహించిన డాక్టర్‌ జిలానీ బాషా వైద్య పట్టాని రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *