MLA Kanna Laxminarayana: పల్నాడు జిల్లాలో కీలక నియోజకవర్గం సత్తెనపల్లి. రాజకీయ పోరాటాలకు, అసలైన పల్నాడు రాజకీయానికి కేరాఫ్ అడ్రస్. 2014 ముందు.. ఆ తరువాత అన్నట్లుగా ఈ నియోజకవర్గంలో రాజకీయం మారిపోయింది. ఇప్పుడు సత్తెనపల్లిలో విచిత్ర రాజకీయం కొనసాగుతోంది. అది విపక్షం నుంచి కాదు. అక్కడి ఎమ్మెల్యే సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ సొంత పార్టీ నేతల నుంచే సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2014లో ఇక్కడి నుంచి దివంగత స్పీకర్ కోడెల శివ ప్రసాద కేవలం 700 ఓట్ల మెజార్టీతో వైసీపీపైన విజయం సాధించి స్పీకర్ అయ్యారు. ఆ తరువాత నియోజకవర్గంలో సమీకరణాలు వేగంగా మారాయి. ఇదే నియోజకవర్గంలో 2019లో వైసీపీ నుంచి అంబటి రాంబాబు నాటి టీడీపీ అభ్యర్ధి కోడెల పైన విజయం సాధించారు.
జిల్లాలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా… జిల్లా సీనియర్ పొలిటీషియన్‌గా.. సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేసిన కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీని వీడి టీడీపీలో చేరారు. అనూహ్యంగా 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్దిగా సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఏకంగా 28 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి కొత్త రికార్డు నెలకొల్పారు. అయితే, గెలిచినప్పటి నుంచి కూడా కన్నాకు ఇక్కడ అనూహ్య పరిణామాలు ఎదురౌవుతున్నాయి. అయినా.. ఎక్కడా బయట పడకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూనే, తన అనుభవంతో, నియోజకవర్గంలో కూటమి ముద్ర వేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు కన్నా. టీడీపీకి చెందిన ముఖ్య నేతలు ఇక్కడ వచ్చే ఎన్నికల్లో సీటు ఆశిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటి నుంచే కన్నాకు వ్యతిరేకంగా నెగటివ్ ప్రచారం ముమ్మరం చేసారట. సొంత పార్టీ నేతల తీరుతో ఓట్ బ్యాంకు నష్టపోతామనే ఆందోళన కనిపిస్తోంది ఇప్పుడు సత్తెనపల్లి టీడీపీ కేడర్‌లో.
Also Read: VasamShetty subash: జగన్ కు దమ్ముంటే లోకేష్‌తో డిబేట్‌కు రావాలి
MLA Kanna Laxminarayana: నియోజకవర్గంలో వివిధ పోస్టులు, కాంట్రాక్టు ఉద్యోగాల కోసం క్యాడర్ పోటీ పడుతోంది. ఒకే పోస్టుకు పెద్ద సంఖ్యలో పోటీ ఉన్నా… దక్కేది ఒక్కరికే. దీంతో, పోస్టు దక్కని వారితో కలిసి ఎమ్మెల్యేను డామేజ్ చేసేందుకు సొంత పార్టీ నేతలు శక్తి మేర ప్రయత్నం చేస్తున్నారట. నాలుగేళ్ల తరువాత వచ్చే ఎన్నికల్లో సీటు కోసం.. ప్రస్తుత ఎమ్మెల్యేకు వెన్నుపోటు పొడుస్తూ తెర వెనుక రాజకీయం ముమ్మరం చేసారట. ఈ తరహా రాజకీయం చేస్తున్న వారిలో నియోజకవర్గంలోని ముగ్గురు ముఖ్య టీడీపీ నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వైసీపీకి నియోజకవర్గంలో పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉందనే ఆందోళన టీడీపీ కేడర్‌లో కనిపిస్తోంది. కాగా, కన్నా మాత్రం ఎక్కడా వీరి గురించి బయట పడకుండా.. పరిస్థితిని అర్దం చేసుకుంటూ తన పని తాను చేసుకుపోతున్నారు. అయినా, సొంత పార్టీ నేతల నుంచే ఈ తరహా రాజకీయం ఎదురవడంపైన కన్నా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. ఇప్పుడు సత్తెనపల్లిలో టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఉత్కంఠను పెంచేస్తున్నాయి.