Mithun Reddy: లిక్కర్ స్కాండల్‌లో ప్రజల ఆస్తులను దోచుకుని కోట్లాది రూపాయలు ఆర్జించిన ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు రప్పించారు. అయితే, ఆయన తనకు అవసరమైన సౌకర్యాల జాబితాను న్యాయస్థానంలో సమర్పించారు. న్యాయస్థానం కూడా చట్టాలు చేసే ప్రజా ప్రతినిధికి సౌకర్యాలు కల్పించడంలో తప్పు లేదంటూ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఏది ఏమైనా.. మిథున్ రెడ్డి కోరిన వసతులు చూస్తే ఆయనను రాజమండ్రి జైలులో ఉంచడం కన్నా, ఆయన అడిగినవన్నీ జైలుకు తరలించడం కన్నా, ఆయననే.. ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో ఒక స్పెషల్ సూట్ బుక్ చేసి, అందులో ఉంచితే సరిపోతుందని కొంతమంది సెటైరికల్‌గా వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ మిధున్ రెడ్డి కోరిన సౌకర్యాల లిస్టు ఏంటంటారా…? జైలు గదిలో ఒక హై ఎండ్ టీవీ, మంచి బెడ్, వెస్ట్రన్ టాయిలెట్, రోజుకు మూడు సార్లు ఇంటి నుండే ఆహారం, బోర్ కొట్టినప్పుడు బయటి నుండి స్నాక్స్, యోగా మ్యాట్, వాకింగ్ షూస్, వార్తా పత్రికలు, తనకు సేవలు చేసుకునేందుకు ఓ వ్యక్తిగత సహాయకుడు, వారంలో ఐదు రోజులు తన న్యాయవాదులతో రహస్య సమావేశాలు నిర్వహించుకునే వెసులుబాటు, నోట్ బుక్‌లు, పెన్నులు.. ఇలా తన ఆఫీసును, బెడ్ రూమ్‌ను కూడా ఆయన తన జైలు గదికి షిఫ్ట్ చేయమని కోరుతున్నట్లుంది ఆ లిస్టు చూస్తే. సాధారణ ఖైదీలకు యూనిఫాం తప్ప సొంత దుస్తులు కూడా ధరించడానికి అవకాశం చోట, ఇలాంటి డిమాండ్లు చేయడం జైలు సంప్రదాయాలను అపహాస్యం చేయడం, రూల్స్‌ని అసలు లెక్క చేయకపోవడమే అన్న వాదన తెరపైకి వస్తోంది. వీరి ధైర్యం, వ్యవస్థలపై వారికున్న ఆధిపత్యం వల్లే అన్న విమర్శ వినబడుతోంది.
Also Read: ED case on Myntra: మింత్రాకు ఈడీ షాక్: ఎఫ్‌డీఐ నిబంధనల ఉల్లంఘనపై కేసు నమోదు
గతంలో చంద్రబాబు నాయుడు ఇదే రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు వైసీపీ నేత సజ్జల.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆవేదనని కూడా అపహాస్యం చేస్తూ మాట్లాడారు. చంద్రబాబుకున్న స్కిన్ అలర్జీ కారణంగా… ఏసీ సమకూర్చాలని అడిగితే, జైలు ఏమైనా అత్తగారి ఇల్లా? అని సజ్జల ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఓ ఖైదీ మాత్రమే అన్న సజ్జల.. ఏసీ పెట్టడానికి, కారవాన్ పంపడానికి ఇక జైలుకు పంపడం ఎందుకంటూ ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ 70 ఏళ్ల వయసులో జైల్లో ఉండలేదా అని కూడా సజ్జల ఆనాడు ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా లేని హక్కు చంద్రబాబుకే ఉంటుందని.. ఆయన కుటుంబీకులు అనుకోవడం ఏంటని సజ్జల నిలదీశారు కూడా. ఇక అదే పార్టీకి చెందిన కొడాలి నాని ఆనాడు చంద్రబాబుపై చేసి వ్యాఖ్యలేంటి? విపరీతంగా దోమలొస్తున్నాయని చంద్రబాబు కంప్లైంట్ చేస్తే… జైల్లో దోమలు కుట్టక… రంభ, ఊర్వశి వచ్చి కన్నుకొడతారా? అంటూ చెత్త వాగుడు వాగారు. నేడు అదే జైలుకు వైసీపీ యువ ఎంపీ మిధున్ రెడ్డి రిమాండ్ ఖైదీగా వెళితే.. గొంతెమ్మ కోరికెలు, ఎక్కడా లేని లగ్జరీలు కోరడం, అందుకు కోర్టు సైతం.. ఏ సౌకర్యాలు అడిగితే అవి కాదనకుండా ఇచ్చేయాలనడం విడ్డూరం కాక మరేమిటి? ఏది ఏమైనా… వైసీపీ నేతలకు బయట ఉన్నా, జైలులో ఉన్నా.. పెద్దగా తేడా ఏమీ లేకుండా నడిచిపోతోంది అలా.

