Mahanadu Success: తెలుగుదేశం పార్టీకి కంచు కోటలంటే కోస్తా, ఉత్తరాంధ్రలే అనే విధంగా ఉండేది గత రెండు దశాబ్దాలుగా పరిస్థితి. ఈ రాయలసీమలో సైకిల్‌ని నెగ్గుకురావడం ఎంతైనా చెప్పు.. కష్టమప్ప అనుకునేవారు తెలుగు తమ్ముళ్లు కూడా. ఏ ఎన్నిక జరిగినా అనంతపురం జిల్లాలో పట్టు నిలుపుకుంటూ వస్తున్నా.. మిగిలిన రాయలసీమ జిల్లాలను వదులుకోవాల్సి వచ్చేది. అనూహ్యంగా సీమలో మార్పు కనిపించింది గత 2024 ఎన్నికల్లో. సరిగ్గా దాన్ని ఒడిసిపట్టుకుంది తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి విషయంలో చంద్రబాబు మూడు ప్రాంతాలను సమానంగానే చూస్తారు. మరి ఆ ఫలాలను రాజకీయంగా పార్టీ తిరిగి రాబట్టుకోవడంలో విఫలమవుతోంది ఎందుకు? అన్న ప్రశ్న ఇక వేసుకోనక్కర్లేదేమో.
ఎందుకంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆ దిశగా ఆల్రెడీ పని మొదలుపెట్టేశారు. అందులో భాగంగానే మహానాడును రాయలసీమ ప్రాంతమైన కడప జిల్లాలో పెట్టి.. రాయలసీమ డిక్లరేషన్‌పై హామీ ఇచ్చి.. కడపకు వరాలు ప్రసాదించి.. ఇకపై సీమపై తన గురి ఎలా ఉండబోతోందో క్లియర్ కట్‌గా తేల్చేశారు. వైఎస్ కంచుకోట కడపలో మహానాడు పెట్టడం అంటే.. “వైనాట్ పులివెందుల” అనుకున్నారంతా. కానీ అంతకు మించి అని కడప మహానాడు అంచనాలను పెంచేసింది. పులివెందుల ఒక్కటే కాదు.. మొత్తం రాయలసీమ ప్రాంతాన్ని పసుపు జెండాకు అడ్డాగా పది కాలాల పాటు పదిలం చేసుకోవాలన్న అజెండాతోనే కడప మహానాడు జరిగిందని అభిప్రాయ పడుతున్నారు పరిశీలకులు. ఎన్నికల ఏడాదిలో కాకుండా.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే ఫోకస్ పెట్టింది అందుకే అంటున్నారు.
కడపలో మహానాడు జరపాలన్న ఆలోచనే ఒక సంచలనం అయితే… ఇక ఇంప్లిమెంట్ చేయడం..? ఒక సవాల్. ఆ సవాల్‌ని బద్ధలుకొట్టింది నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటల్లో చెప్పాలంటే… శ్రద్ధగా, గోడ కట్టినంత పద్దతిగా పని కానిచ్చేసింది. అతి భారీ కార్యక్రమాన్ని ఒక్కటంటే ఒక్క అపశృతి లేకుండా.. అతిశయోక్తులకు ఎక్కడా పోకుండా.. అనవసరమైన హడావుడి, హంగామా లేకుండా.. పక్కా ఫ్రొఫెషనల్‌గా నిర్వహించింది. ఇక్కడే ఇతర రాజకీయ పార్టీలకు, తెలుగుదేశం పార్టీకి ఉన్న తేడా కనిపిస్తుంది. చివరి రోజు 5 లక్షల మందికి ఏర్పాట్లు చేస్తున్నామని టీడీపీ ప్రకటించింది. కానీ 6 నుంచి 7 లక్షల మంది హాజరై ఉంటారని సభా ప్రాంగణం విహంగ వీక్షణాన్ని బట్టి అంచనా వేస్తున్నారు. అంత మంది జనాభా.. ఒక్క చోట చేరినా.. స్కూల్ పిల్లలు ప్రేయర్‌కి హాజరైనట్లుగా అనిపించింది తప్ప గందరగోళం ఎక్కడా కనిపించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు చెప్పే క్రమశిక్షణకు మహానాడు అద్దం పట్టింది.
Also Read: R Narayana Murthy: సినిమా బాగుంటే జనం చూస్తారు.. ఆర్. నారాయణమూర్తి కీలక వాక్యాలు..
Mahanadu Success: ఏ మహానాడు అయినా పసుపు ప్రభంజనమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిలబడి, తలబడి, గెలిచాక చేసుకుంటున్న పార్టీ అతిపెద్ద ఉత్సవం కాబట్టి.. తమ్ముళ్లు పోటెత్తుతారని ముందే ఊహించింది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు ఉండాలని రాష్ట్ర నాయకత్వానికి ముందే సంకేతాలు పంపింది. స్థానిక నాయకత్వాన్ని రంగంలోకి దించింది. కమిటీలు వేసుకుని, మూడొందల మందికి పైగా పద్ధతిగా పనిచేయడంతో అనుకున్నది సాధ్యమైంది. ఈ మహానాడుతో ఇకపై కడప ఎవరి అడ్డా కాదన్న సంకేతం జనంలోకి పంపింది తెలుగుదేశం పార్టీ. మూడు రోజుల పాటు జరిగిన సభలు, ప్రసంగించిన వక్తలు, చేసిన తీర్మానాలు.. గత మహానాడుల కంటే ఈ మహానాడును సరికొత్తగా నిలిపాయి. ఇదివరకూ మహానాడు అంటే వంటకాలు, ఆతిధ్యం వంటి అంశాలకే పరిమితం అన్న అభిప్రాయం ఉండేది. ఈ సారి విస్తృత అజెండాతో మహానాడు జరిగింది. మహానాడు పక్కా పొలిటికల్ సభ. ఏ రాజకీయ సభ ఉద్దేశ్యం అయినా రాజకీయ ప్రయోజనమే. ఆ గురి తప్పకుండా చూసుకుంది ఈసారి టీడీపీ. నాయకుల ప్రసంగాలు కూడా సాగదీత ధోరణిలో కాకుండా షార్ప్‌గా ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా ఉండటం ఈ మహానాడులో కనిపించిన మరో మార్పు. లోకేష్ చేసిన ఆరు తీర్మానాలు కూడా మహానాడుకు కొత్తదనాన్ని తీసుకొచ్చాయ్. “తెలుగు జాతి కోసం పుట్టిన పార్టీ” అనే భావన తెలుగుదేశం పార్టీకి పేటెంట్ లాంటిది. అది ఎక్కడా మిస్ అవ్వకుండా చూసుకుంటూనే.. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు మార్పును స్వాగతించింది ఈ మహానాడు.
మొదటి రోజు ప్రతినిధుల సభ 25 వేల మందితో అనుకుంటే 75 వేల మంది దాకా హాజరయ్యారు. రెండో రోజు లక్ష మందికిపైగా హాజరై విజయవంతం చేశారు. ఇక మూడో రోజు 5 లక్షలు అనుకుంటే ఆరేడు లక్షల మంది పసుపు సైన్యంతో ఆఖరి అంకం ఘనంగా ముగించారు. ఎక్కడో ఉన్న సిక్కోలు నుండి కూడా… ఏడెనిమిది వందల కిలోమీటర్లు దాటుకుని కార్యకర్తలు కడపకు వచ్చారు. అలా కడప గడపకు చెరగని విధంగా పసుపు రాసేసి వెళ్లింది మహానాడు. చివరగా ఒక్కమాటలో ముగించాలంటే… కోపం వస్తే ఇంట్లో పడుకుంటారు కానీ మరో పార్టీకి పని చేయరని చంద్రబాబు అంటారు. అది వంద శాతం నిజమని ఈ మహానాడుతో మరోసారి రుజువైంది. తెలుగువారి ప్రత్యేకమైన గుర్తింపుగా ఉన్న టీడీపీ మరో నలభై ఏళ్ల పాటు నిరాటంకంగా పయనం సాగిస్తూందని ఈ మహానాడు మరోసారి నిరూపితం చేసింది.